గజ్వేల్ మున్సిపల్ వార్డుల డీలిమిటేషన్ ఎప్పుడో ?

గజ్వేల్ మున్సిపల్ వార్డుల డీలిమిటేషన్ ఎప్పుడో ?
  • ముంపు గ్రామాలతో పెరగనున్న వార్డుల సంఖ్య
  • మారనున్న గజ్వేల్ మున్సిపల్ గ్రేడ్

సిద్దిపేట/గజ్వేల్, వెలుగు: సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్​ముంపు గ్రామాలను గజ్వేల్ మున్సిపాలిటీలో కలపడంతో వార్డుల డీ లిమిటేషన్ అవసరం ఏర్పడింది. ఇటీవల రాష్ట్రంలో 27 మున్సిపాలిటీలతో పాటు 3 కార్పొరేషన్లలో వార్డుల డీ లిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేసినా ఈ జాబితాలో గజ్వేల్ మున్సిపాలిటీకి స్థానం దక్కలేదు. ఓ వైపు ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఇంకా డీలిమిటేషన్ ప్రక్రియపై స్పష్టత రాకపోవడంతో కౌన్సిలర్ పదవులకు పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల్లో టెన్షన్​మొదలైంది.

 మల్లన్న సాగర్ నిర్మాణంతో తొగుట మండలంలోని వేములఘాట్, బ్రాహ్మణ బంజేరుపల్లి, లక్ష్మాపూర్, పల్లెపహాడ్, ఏటిగడ్డ కిష్టాపూర్, కొండపాక మండలంలోని సింగారం, ఎర్రవల్లి గ్రామాలు ముంపునకు గురయ్యాయి.  ఈ గ్రామాల ప్రజలను గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్, ముట్రాజ్ పల్లి పరిధిలో నిర్మించిన ఆర్అండ్ఆర్ కాలనీకి నాలుగేండ్ల కింద తరలించారు. అక్కడే ప్రైవేట్ భవనాల్లో గ్రామ పంచాయతీలను నిర్వహిస్తున్నారు. గత జనవరిలోఓటరు జాబితాను విడుదల చేయడంతో ముంపు గ్రామాలను డీ నోటిఫై చేశారు.

పెరగనున్న వార్డుల సంఖ్య

ప్రస్తుతం గజ్వేల్​మున్సిపాలిటీలో 20 వార్డులుండగా డీ లిమిటేషన్ ప్రక్రియను నిర్వహిస్తే 30 వార్డులకు పెరిగే అవకాశం ఉంది. ఆర్అండ్ఆర్ కాలనీలో దాదాపు 15 వేలకు పైగా జనం ఉండగా  పదివేలకు పైగా ఓటర్లు ఉన్నారు. 

ప్రస్తుతం గజ్వేల్ మున్సిపాలిటీ 50 చదరపు కిలోమీటర్ల  పరిధిలో విస్తరించగా గజ్వేల్ పట్టణంతో పాటు ప్రజ్ఞాపూర్, రాజిరెడ్డిపల్లి, సంగాపూర్, క్యాసారం, ముట్రాజ్ పల్లి గ్రామాల్లో దాదాపు 50 వేల పై చిలుకు జనాభా ఉన్నారు.  ఆర్అండ్ఆర్ కాలనీలోని 7 ముంపు గ్రామాల్లోని జనాభాను కలుపుకుంటే దాదాపు గజ్వేల్ మున్సిపాలిటీ జనాభా 70 వేలకు చేరుతుంది. ముంపు గ్రామాల విలీనంతో  జనాభా పెరిగి గజ్వేల్ మున్సిపాలిటీ  గ్రేడ్ 2 గా అవతరించే అవకాశం ఉంది. 

మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వసతుల కల్పన

గజ్వేల్ మున్సిపాలిటీ  పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీలో మౌలిక వసతుల కల్పనను మున్సిపల్ అధికారులే పర్యవేక్షిస్తున్నారు. కాలనీ ప్రజలకు తాగునీటి సరఫరాతో పాటు శానిటేషన్ నిర్వహణ కు సంబంధించి ఆయా గ్రామా పంచాయతీల ట్రాక్టర్లకు డీజిల్ ను సరఫరా చేస్తున్నారు. ఇటీవల ఆర్అండ్ఆర్ కాలనీలో బర్త్, డెత్ సర్టిఫికెట్లతోపాటు శానిటేషన్ నిర్వహణ విషయంపై ఇబ్బందులు ఏర్పడడంతో  కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ అధికారులు  సమస్యను పరిష్కరించారు. జియోగ్రాఫికల్ గా ఆర్అండ్ఆర్ కాలనీ మున్సిపాలిటీలో ఉండడంతో  మౌలిక వసతులను మున్సిపల్ అధికారులే పర్యవేక్షిస్తున్నారు. 

ఆశావహుల ఎదురుచూపులు

మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు డీ లిమిటేషన్ ఎప్పుడు జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వార్డుల డీ లిమిటేషన్ జరిగితే తమకు అనుకూలమైన  వార్డును ఎంపిక చేసుకునే అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు. గజ్వేల్ మున్సిపాలిటీపై పట్టు సాధించాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. డీ లిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే రిజర్వేషన్లపై కొంత మేర స్పష్టత వచ్చే అవకాశం ఉండడంతో ఆశావహులు ఇప్పటి నుంచే తాము పోటీ చేయాలనుకుంటున్న ఏరియాల్లో ప్రజలను కలుస్తున్నారు. 

ఆదేశాలు వస్తేనే డీ లిమిటేషన్​

ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తేనే గజ్వేల్​మున్సిపాలిటీ పరిధిలో వార్డుల డీ లిమిటేషన్ ప్రక్రియను నిర్వహిస్తాం. ప్రస్తుతం ఆర్అండ్ఆర్ కాలనీలో మౌలిక వసతుల కల్పనను మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. శానిటేషన్, తాగునీటి సరఫరాతో పాటు వివిధ రకాల సర్టిఫికెట్లను మున్సిపాలిటీ నుంచే జారీ చేస్తున్నాం.- బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్, గజ్వేల్‌‌‌‌ ‌‌మున్సిపాలిటీ