
- మొత్తం 128 కులాలకు గాను మిగిలిన వారెవరికీ చట్టసభల్లో దక్కని ప్రాతినిధ్యం
- దాదాపు 80 కులాలకు సర్పంచ్ పదవులు కూడా దక్కలేదు
- 50 కులాల వాళ్లకు వార్డ్ మెంబర్ పదవి సైతం రాలేదు
- పీసీసీ సర్వేలో గుర్తింపు.. అట్టడుగు కులాల వివరాలు సేకరణ
- వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆలోచన
హైదరాబాద్, వెలుగు: బీసీల్లోని అట్టడుగు కులాలు, సంచార జాతులకు కులగణన ఫలితాలు అందించేందుకు పీసీసీ కార్యాచరణ రూపొందిస్తున్నది. కులగణన లెక్కల ఆధారంగా ఈ జాతులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలన్న ఆలోచనతో ఆయా కులాల వివరాలను సేకరిస్తున్నది. మొత్తం 128 బీసీ కులాలు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించగా.. ఇందులో ఇప్పటి వరకు 10 నుంచి 15 కులాలకు మాత్రమే చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించినట్టు పీసీసీ గుర్తించింది. మిగిలిన కులాలవారెవరూ చట్టసభల్లో అడుగుపెట్టలేదని సర్వే ద్వారా తెలుసుకుంది. కనీసం జిల్లా, మండల పరిషత్, సర్పంచ్ పదవులు కూడా దక్కని కులాలు దాదాపు 80 వరకు ఉన్నట్టు గుర్తించింది.
దాదాపు 50 బీసీ, సంచార జాతులకు చెందిన వారు ఇప్పటిదాకా పంచాయతీ వార్డు మెంబర్‌గా కూడా ఎన్నిక కాలేదనే అంచనాకు వచ్చింది రాజకీయంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాతినిధ్యం దక్కని కులాలను గుర్తించి, ఏ ప్రాంతంలో ఏ కులాల వారు ఎక్కువగా ఉన్నారనే వివరాలను తెలుసుకోవాలని పీసీసీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇప్పటివరకు లోకల్బాడీల్లో ప్రాతినిధ్యం పొందని కులాలు, సంచార జాతుల వివరాలను పంపాలని డీసీసీలను, మండల కాంగ్రెస్కమిటీలను ఆదేశించింది. ఆ వివరాల ఆధారంగా ఆయా వర్గాలకు లోకల్‌బాడీ ఎన్నికల్లో వార్డుమెంబర్, సర్పంచ్, జిల్లా, మండల పరిషత్ సభ్యులుగా అవకాశం కల్పించే దిశగా కాంగ్రెస్‌నేతలు కసరత్తు చేస్తున్నారు.
ఏ, డీ గ్రూపుల నుంచి ప్రాతినిధ్యం అంతంతే..
బీసీల్లోని బీ, సీ గ్రూపులో ఉన్న కులాలు తప్ప.. ఏ, డీ గ్రూపులో ఉన్న కులాలకు చట్టసభల్లోనూ ప్రాతినిధ్యం అంతంతమాత్రమేనని బీసీ నేతలు చెప్తున్నారు. చట్టసభలకు ఎన్నికైన బీసీ కులాల లిస్ట్వేళ్ల మీద లెక్కించవచ్చని అంటున్నారు. వడ్డెర, నాయీబ్రహ్మణ, వడ్రంగి, కమ్మరి, కుమ్మరి వంటి కులాలకు ప్రాతినిధ్యం లేదని చెబుతున్నారు.
అవుసుల (విశ్వబ్రాహ్మణ) వంటి కొన్ని కులాలకు ఎప్పుడో ఒకసారి అవకాశం లభిస్తున్నదని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో చట్ట సభలకు ఎంట్రీ ఇవ్వని కులాలకు, తక్కువగా రాజకీయ ప్రాతినిధ్యం ఉన్న కులాలను గుర్తించి వారికి అవకాశాలు కల్పించేందుకు ఇప్పటినుంచే ఫోకస్పెడుతున్నట్టు పీసీసీ నేత ఒకరు చెప్పారు.