రెండో రోజూ నష్టాలే ! సెన్సెక్స్ 721 పాయింట్లు పతనం.. నిఫ్టీ 225 పాయింట్లు డౌన్

రెండో రోజూ నష్టాలే ! సెన్సెక్స్ 721 పాయింట్లు పతనం.. నిఫ్టీ 225 పాయింట్లు డౌన్

ముంబై: వరుసగా రెండో రోజైన శుక్రవారం కూడా స్టాక్​ మార్కెట్లు నష్టపోయాయి. విదేశీ నిధుల తరలింపు, ఆర్థిక, ఐటీ  చమురు, గ్యాస్ షేర్లలో భారీ అమ్మకాల కారణంగా సెన్సెక్స్ 721 పాయింట్లు పడిపోయింది. 0.88 శాతం తగ్గి నెల కనిష్ట స్థాయి 81,463.09 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 786.48 పాయింట్లు తగ్గి 81,397.69కి చేరుకుంది. 50 షేర్ల ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 225.10 పాయింట్లు క్షీణించి 24,837 నెల కనిష్ట స్థాయికి చేరుకుంది.

ఆసియన్, యూరోపియన్ మార్కెట్లలో బలహీనమైన ధోరణి కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌‌‌‌ను దెబ్బతీసిందని ఎనలిస్టులు తెలిపారు. జియోజిత్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్స్ లిమిటెడ్ పరిశోధనా విభాగాధిపతి వినోద్ నాయర్ మాట్లాడుతూ, కార్పొరేట్ ఫలితాలు బాగాలేకపోవడం, ప్రపంచవ్యాప్త సంకేతాలు దేశీయ ఈక్విటీలలో అమ్మకాలకు దారితీశాయని, లార్జ్-క్యాప్ స్టాక్‌‌‌‌లలో అధిక వాల్యుయేషన్ల వల్ల సూచీలపై ఒత్తిడి పెరిగిందని అన్నారు.

సెన్సెక్స్ సంస్థలలో బజాజ్ ఫైనాన్స్ 4.73 శాతం పడింది. జూన్ క్వార్టర్​ రిజల్ట్స్​మెప్పించకపోవడంతో దెబ్బతింది. పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌‌‌‌సర్వ్, ట్రెంట్, టాటా మోటార్స్, ఎన్​టీపీసీ,  అదానీ పోర్ట్‌‌‌‌లు కూడా వెనకబడి ఉన్నాయి. అయితే, సన్ ఫార్మా,  భారతి ఎయిర్‌‌‌‌టెల్ లాభాలను ఆర్జించాయి. బీఎస్​ఈ స్మాల్‌‌‌‌క్యాప్ గేజ్ 1.88 శాతం, మిడ్‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 1.46 శాతం పడిపోయాయి. రెండు రోజుల నష్టాల వల్ల ఇన్వెస్టర్ల సంపద 8.67 లక్షల కోట్లు తగ్గింది.

సెక్టోరల్ ఇండెక్స్లకూ నష్టాలే
బీఎస్​ఈ సెక్టోరల్​ ఇండెక్స్​లలో యుటిలిటీస్ 2.37 శాతం, పవర్ 2.36 శాతం, ఆయిల్ అండ్​ గ్యాస్ 2.11 శాతం, ఇండస్ట్రియల్స్ 1.88 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.83 శాతం, ఐటీ 1.65 శాతం,  మెటల్ 1.64 శాతం నష్టపోయాయి. బీఎస్​ఈ హెల్త్​కేర్​ మాత్రమే లాభపడింది. బీఎస్​ఈలో 2,892 స్టాక్‌‌‌‌లు క్షీణించగా, 1,117 లాభాలను సంపాదించాయి.

ఈ వారంలో బీఎస్​ఈ బెంచ్‌‌‌‌మార్క్ గేజ్ 294.64 పాయింట్లు (0.36 శాతం), నిఫ్టీ 131.4 పాయింట్లు  (0.52 శాతం) తగ్గింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గురువారం (ఎఫ్​ఐఐలు) రూ.2,133.69 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మగా, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డీఐఐలు) రూ.2,617.14 కోట్ల విలువైన స్టాక్‌‌‌‌లను కొన్నారు.

ఆసియా మార్కెట్లలో, జపాన్‌‌‌‌కు చెందిన నిక్కీ 225 ఇండెక్స్, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్,  హాంకాంగ్‌‌‌‌ హాంగ్ సెంగ్ నష్టాల్లో స్థిరపడగా, దక్షిణ కొరియా  కోస్పి పాజిటివ్​గా ముగిసింది. యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. గురువారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. భారతదేశం,  యూకే గురువారం  స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాయి.

దీనివల్ల వచ్చే ఏడాది నుంచి 99 శాతం భారతీయ ఎగుమతులకు యూకేలో సుంకం ఉండదు. కార్లు,  విస్కీ వంటి బ్రిటిష్ ఉత్పత్తులపై సుంకాలు తగ్గుతాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌‌‌‌మార్క్ బ్రెంట్ క్రూడ్ 0.32 శాతం పెరిగిబ్యారెల్ ధర 69.40 డాలర్లకు చేరుకుంది.