
- ఇంటెల్లో 25 వేల ఉద్యోగాలకు కోత
- నష్టాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
- ఖర్చులు తగ్గించుకునేందుకు లేఆఫ్లు తప్పవని ప్రకటన
- ఈ ఏడాది సెకండ్ క్వార్టర్లో15 వేల మంది తొలగింపు
వాషింగ్టన్: చిప్ తయారీ కంపెనీ ఇంటెల్ భారీగా ఉద్యోగాలకు కోత పెట్టనుంది. త్వరలో 25 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఏడాది చివరి లోపు ఉద్యోగుల సంఖ్యను 75 వేలకు తగ్గించేందుకు ప్లాన్ చేస్తున్నది. దశలవారీగా 25 వేల మందిని ఇంటికి పంపనుంది. ఇదివరకే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 15 వేల మంది ఉద్యోగులను సంస్థ తొలగించింది. అలాగే గత ఏడాది కూడా 15 వేల మందికిపైనే ఇంటికి పంపింది. ఈ ఏడాది రెండో త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను ఇంటెల్ విడుదల చేసింది. త్వరలోనే 25 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
సెకండ్ క్వార్టర్లో కంపెనీకి రూ.లక్ష కోట్ల ఆదాయం రాగా.. రూ.25 వేల కోట్ల నష్టాలు వచ్చాయని పేర్కొంది. నష్టాలు, వ్యయాలు తగ్గించుకునేందుకు భారీగా కోతలు పెట్టక తప్పని పరిస్థితి నెలకొందని తెలిపింది. జర్మనీ, పోలండ్‌లో కొత్త ఫ్యాక్టరీలు నిర్మించాలన్న ఆలోచనను కూడా కంపెనీ విరమించుకుంది. ఆ కంపెనీలను వియత్నాం లేదా మలేషియాకు మార్చాలనుకుంటున్నది. ఒకప్పుడు చిప్ మార్కెట్ లో లీడర్ గా వెలుగు వెలిగిన ఇంటెల్.. గత కొన్నేండ్లుగా ఒడిదొడుకులతో సతమతం అవుతోంది. మైక్రోసాఫ్ట్ కూడా ఇటీవలే 15 వేల మంది ఉద్యోగులను తొలగించింది.