
- డేటా ఎవరి దగ్గరుంటే వాళ్లదే పవర్.. ఆ డేటా తెలంగాణ సొంతం
- ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు తేవాలి
- 2004లో కులగణన ప్రభావాన్ని తెలుసుకోలేకపోయిన
- తప్పు నాదే అయినా.. దాన్ని సరి చేస్తున్న
- ఓబీసీల చరిత్ర బయటకు రాకుండా ఆర్ఎస్ఎస్ కుట్ర
- మోదీ.. ఉత్త షోమ్యాన్, బిల్డప్ ఇస్తుంటరు
- ప్రాంతీయ భాషతో పాటు ఇంగ్లీషూ ముఖ్యమే
- ‘భాగీదారి న్యాయ్ సమ్మేళన్’లో వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన.. దేశ రాజకీయాల్లో సునామీ లాంటిదని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. కుల గణన ద్వారా రాష్ట్రంలోని వివిధ కులాలు, సామాజిక వర్గాల ఆర్థిక, సామాజిక స్థితిగతులు తెలిశాయని చెప్పారు. ఓబీసీ, దళిత, ఆదివాసీ, ఇతర బలహీన వర్గాలకు సంబంధించిన డేటా మొత్తం తెలంగాణ ప్రభుత్వం సేకరించిందని.. దేశంలో ఎక్కడా లేని పవర్ పుల్ డేటా తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉందని పేర్కొన్నారు. తెలంగాణ కుల గణన.. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
ఢిల్లీ టాల్కటోరా ఇండోర్ స్టేడియంలో ఏఐసీసీ బ్యాక్‌వర్డ్ క్లాస్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘భాగీదారి న్యాయ్ సమ్మేళన్’ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడారు. ఎన్నో వర్గాల చరిత్ర బయటకు వచ్చినా.. ఓబీసీల చరిత్ర మాత్రం బయటకు రాలేదని, దీని వెనుక ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ప్రధానమంత్రి మోదీ.. ఉత్త షోమ్యాన్ అని విమర్శించారు. ‘‘తెలంగాణలో మేం చేపట్టిన కులగణన సర్వే.. పొలిటికల్ ఎర్త్‌క్విక్. అది దేశ రాజకీయాల్లో సునామీని తీసుకువస్తుంది’’ అని రాహుల్ అన్నారు. దేశ వ్యాప్తంగా కుల గణన జరిగేదాకా పోరాడేందుకు శపథం తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రైవేటు సెక్టార్‌లోనూ రిజర్వేషన్లు రావాలని ఆకాంక్షించారు.
కులగణన.. లెక్కల డేటా కాదు..
కులగణన.. దేశంలో సామాజిక న్యాయాన్ని సాధించడానికి ఒక కీలకమైన ముందడుగు అని రాహుల్ గాంధీ తెలిపారు. ఈ లెక్కల ఆధారంగా సంక్షేమ పథకాలు అమలు చేసే వీలవుతుందని చెప్పారు. ‘‘దేశంలోని 90% జనాభా (ఓబీసీ, దళిత, ఆదివాసీ, మైనారిటీ వర్గాలు) సరైన ప్రాతినిథ్యం, అవకాశాలు పొందడం లేదు.
కుల గణన ద్వారా ఈ వర్గాల ఆర్థిక, సామాజిక స్థితిగతులు తెలుసుకోవచ్చు. వారికి న్యాయం చేసేందుకు అవసరమైన విధానాలను రూపొందించొచ్చు. దేశంలోని అసమానతలు తొలగించడంలో కుల గణన కీలక పాత్ర పోషిస్తది. కుల గణన అనేది కేవలం గణాంకాల సేకరణ మాత్రమే కాదు. ఇది సామాజిక న్యాయానికి ఒక శక్తిమంతమైన సాధనం’’అని రాహుల్ గాంధీ అన్నారు.
తెలంగాణ వద్ద ఉన్న డేటాకు ఏదీ సాటిలేదు
తెలంగాణ వద్ద ఉన్న కుల గణన డేటా.. దేశంలోని ఏ రాష్ట్రం వద్ద లేదని రాహుల్ ప్రశంసించారు. ‘‘తెలంగాణ వద్ద ఉన్న డేటాకు ఏదీ సాటి లేదు. తెలంగాణలో చాలా కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి. ఏదైనా ఒక కంపెనీలో ఎంత మంది పని చేస్తున్నారు? పని చేస్తున్నవారిలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎంత మంది ఉన్నారో ఒక నిమిషంలో చెప్పేస్తాం. కంపెనీ మేనేజ్మెంట్లో కూడా కులాల వారీగా లెక్కలు తీసి మీ ముందు పెట్టగలం.
యజమానుల్లో కూడా ఏ వర్గం నుంచి ఎంత మంది ఉన్నారో కూడా చెప్పే డేటా తెలంగాణ ప్రభుత్వం వద్ద ఉన్నది. వర్గాల వారీగా ఎవరికి.. ఎంత ప్యాకేజీ దక్కిందో కూడా చెప్పగలం. కానీ.. బీసీ, ఎస్సీ, ఎస్టీల యువతకు కోట్ల రూపాయల ప్యాకేజీలు మాత్రం దక్కడం లేదు. ఇది తెలంగాణ వద్ద ఉన్న డేటా చెప్తున్నది. దళితులు, ఆదివాసీలే గిగ్ వర్కర్లుగా పని చేస్తున్నారు’’అని రాహుల్ అన్నారు.
చేసిన తప్పును సరిచేసేందుకు ప్రయత్నిస్తున్న
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కులగణన ప్రభావం అర్థం చేసుకోలేకపోయామని రాహుల్ అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ తప్పు కాదని.. ముమ్మాటికీ తన తప్పే అని చెప్పారు. ఇప్పుడు ఆ తప్పును సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ‘‘నేను 2004 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే.. ఓ తప్పు చేశానని అర్థమవుతున్నది. నేను ఓబీసీల హక్కులను రక్షించాల్సిన విధంగా రక్షించలేదు. అప్పట్లో మీ (ఓబీసీలను ఉద్దేశించి..) సమస్యలు లోతుగా తెలుసుకోలేకపోయాను.
సమస్యలు సరిగా అర్థం చేసుకుంటేనే పరిష్కారం సాధించగలం. అప్పుడే అర్థం చేసుకుని ఉంటే అప్పట్లోనే దేశమంతా కులగణన చేపట్టేవాళ్లం. తప్పు నాదే.. పార్టీది కాదు. ఆ తప్పును సరి చేసేందుకు పోరాడుతున్న. దేశంలో దళితుల చరిత్రను అంబేద్కర్ అర్థం చేసుకున్నారు. ఓబీసీల చరిత్ర ఎక్కడుంది? బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఉద్దేశపూర్వకంగా ఆ చరిత్రను చెరిపేశాయి. ఇది సామాజిక న్యాయానికి విరుద్ధం’’అని రాహుల్ అన్నారు.
ఇంగ్లిష్‌ను వ్యతిరేకించే వాళ్ల పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నరు?
ఓబీసీల చరిత్ర గురించి ఎవరూ రాయలేదని రాహుల్ గాంధీ అన్నారు. ‘‘పెద్ద పెద్ద వ్యాపారవేత్తల పేర్లు బయటికి తీయండి. అందులో ఒక్కరైనా ఓబీసీ ఉన్నారా? అదానీ ఒబీసీనా? ఓబీసీ, దళిత, ఆదివాసీ వర్గాలకు సరైన ప్రాతినిథ్యం, గౌరవం ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఓబీసీ యువత.. ఎంతో శక్తిమంతులు. వాళ్ల బలం.. వారికి తెలియడం లేదు. ఒక్కసారి వాళ్ల శక్తేంటో వారికి అర్థమైతే.. దేశ రాజకీయాలే మారిపోతాయి’’అని రాహుల్ అన్నారు.
అభివృద్ధిలో విద్యే ప్రధానం అని తెలిపారు. ‘‘ఇంగ్లిష్‌ను వ్యతిరేకించేవాళ్లంతా తమ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నరు? ఇంగ్లిష్ నేర్చుకుంటే అవకాశాలు రెట్టింపు అవుతాయి. బీజేపీ నేతలు మాత్రం ఇంగ్లిష్‌ను వ్యతిరేకిస్తున్నారు. ప్రాంతీయ భాషలూ ముఖ్యమే. దాంతో పాటు ఇంగ్లిష్ ప్రాధాన్యాన్నీ అర్థం చేసుకోవాలి’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.
మీరిచ్చే చక్కెరతోనే హల్వా చేస్తరు.. కానీ, మీకివ్వరు
కార్పొరేట్ ఇండియాలో ఓబీసీలు ఎక్కడున్నారని రాహుల్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ‘‘బడ్జెట్‌కు ముందు హల్వా వండి తింటారు. కానీ.. దేశంలోని 90 శాతం ఉన్న మీకు (ఓబీసీ, దళిత, ఆదివాసీ, మైనార్టీలను ఉద్దేశిస్తూ) మాత్రం హల్వా ఇవ్వరు. మీరే దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కష్టపడి పని చేస్తున్నారు. అసలు ఆ హల్వా తయారీకి మీరే కారణం. కానీ.. తినడానికి మాత్రం మీరు అర్హులు కాదా? హల్వాలో వాడిన చక్కెర మీరు తయారు చేసిందే.
నేను కోరుకుంటున్నది ఒక్కటే.. మీకు ఆ హల్వాలో వాటా, దేశంలో గౌరవం దక్కాలి’’అని రాహుల్ అన్నారు. హల్వా తినడంలో కనిపించిన అసమానతలు తొలగించేందుకే కుల గణన అవసరమని తెలిపారు. డిఫెన్స్, ఫైనాన్స్ లాంటి పెద్ద పెద్ద మంత్రిత్వ శాఖల్లో ఒక్కరు వెనుకబడిన వర్గాల నేతలు లేరని విమర్శించారు.
అప్పుడు ఆయిల్.. ఇప్పుడు డేటా
మోదీ ఎప్పుడూ ‘డేటా.. డేటా..’అంటూ జపం చేస్తుంటారని రాహుల్ అన్నారు. ‘‘ట్రిపుల్ డీ.. ఫోర్ డీ.. ఫైవ్ డీ.. త్రీడీ అనే వ్యాఖ్యలు ఎప్పుడూ మోదీ నోటి నుంచి వింటుంటాం. 50 ఏండ్ల కింద చూస్తే.. అధికారం అనేది ఆయిల్ నుంచి దక్కేది. ఆ ఆయిల్‌ను ‘బ్లాక్ గోల్డ్’ అని పిలిచేవాళ్లు. ఎవరి దగ్గర ఈ బ్లాక్ గోల్డ్ ఉంటే.. ఆ దేశం ప్రపంచాన్ని శాసించేది. ప్రపంచం మొత్తాన్ని కంట్రోల్ చేసేది. ఇది 50 ఏండ్ల కిందటి ముచ్చట.. కానీ, ఇప్పుడు అధికారం ఎలా దక్కుతది? అని అడిగితే మాత్రం.. ఆయిల్ కాదు.. డేటా నుంచి అని చెప్పగలను. అలాంటి పవర్ఫుల్ డేటా.. తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉన్నది’’అని రాహుల్ అన్నారు.
తెలంగాణతో భావోద్వేగ బంధం ఉంది
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ కీలక పాత్ర పోషించారు. దీంతో అక్కడి ప్రజలు, వారి భాష, సంస్కృతితో మాకు లోతైన భావోద్వేగ బంధం ఏర్పడింది. వాళ్ల నీతి, నిజాయితీ, అందరినీ కలుపుకొని పోయేతత్వం దేశానికి మార్గనిర్దేశం చేసింది.
మోదీది.. అంతా బిల్డప్ మాత్రమే..
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కుల గణనకు వ్యతిరేకంగా ఉన్నాయని రాహుల్ విమర్శించారు. కలిసికట్టుగా జనగణన, కుల గణన ఆపేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. ‘‘కుల గణనతోనే బలహీన వర్గాలకు సరైన ప్రాతినిథ్యం లభిస్తది. ఇది బీజేపీ రాజకీయ ఎజెండాకు విరుద్ధం. ప్రధాని మోదీ.. ఉత్త షో మ్యాన్. ఆయన్ను రెండు.. మూడు సార్లు కలిశాను. ఒకే రూమ్‌లో కూర్చున్నాం. అప్పుడే నాకు అర్థమైంది.. ఆయనకు అంత సీన్ లేదని. ఆయనదంతా బిల్డప్ మాత్రమే అని. మీడియా అంతా మోదీకి అనవసరంగా ప్రాధాన్యత ఇస్తున్నది. మోదీని నేను పెద్ద సమస్యగా భావించడం లేదు”అని రాహుల్ అన్నారు.