- 99 రోజుల యాక్షన్ ప్లాన్‌పై అధికారులకు దిశానిర్దేశం
- -అభివృద్ధి, సంక్షేమం పక్కాగా అమలు చేయాలని ఆదేశాలు
- హైదరాబాద్‌లో కార్యక్రమానికి సీఎం రేవంత్ శ్రీకారం
హైదరాబాద్, వెలగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు పట్టాలెక్కింది. శుక్రవారం ఉమ్మ డి జిల్లాల్లో మంత్రులు సన్నాహక సమావేశాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిర్దేశిత 99 రోజుల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలని యంత్రాంగానికి మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాపాలన అసలు ఉద్దేశం సామాన్యుడికి సైతం స్పష్టంగా అర్థమయ్యేలా ప్రణాళికలు రూపొందిం చాలని దిశానిర్దేశం చేశారు.
హైదరాబాద్ లో ‘ప్రజా పాలన -– ప్రగతి ప్రణాళిక’కు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రెండు ప్రాజెక్టులను ప్రారంభిం చారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా సన్నాహక సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ రఘునందన్ రావు పాల్గొని.. 3 జిల్లాల కలెక్టర్లకు లక్ష్యాలను వివరిం చారు. 99 రోజుల తర్వాత ప్రతి శాఖ పనితీరుపై కచ్చి తమైన ఆడిట్ ఉంటుందని, ఆశించిన ఫలితాలు రాక పోతే కలెక్టర్లదే బాధ్యతని మంత్రి హెచ్చరించారు. ఈ వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందుస్తుగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తే, కేబినెట్ ద్వారా అదనపు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.
మాసబ్ ట్యాంక్‌లో అద్దాల లైబ్రరీ..
మహిళా సాధికారతే లక్ష్యంగా హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ తొలిసారిగా అద్దాల లైబ్రరీతో పాటు వ్యర్థాల సేకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. పట్టణ ప్రాంతాల్లోని మహిళలు సైతం సంఘాల్లో చేరి ఆర్థికంగా ఎదగాలని, ఇంట్లోని పాత ఎలక్ట్రానిక్ వస్తువులను రీసైక్లింగ్‌కు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఖమ్మం కలెక్టరేట్‌లో మం త్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి సన్నా హక సమావేశం నిర్వహించి.. అధికారులను అలర్ట్ చేశారు. మార్చి 31లోపు ఇందిరమ్మ ఇండ్ల నిర్మా ణాలు ప్రారంభం కావాలని, రాష్ట్రంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.
మహిళలు ఆర్థికంగా పురోగమిస్తేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని నిజామాబాద్ సభలో మంత్రి సీతక్క పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళల ఉత్పత్తుల ప్రదర్శనను పరిశీలించిన ఆమె, రుణాలు సులభతరం చేసేలా మహిళా దినోత్సవం నాటికి కొత్త పథకాలు తెస్తామన్నారు.
రాష్ట్రంలోని అట్టడుగు వర్గాలకు ప్రగతి ఫలాలు అందించడమే ఈ 99 రోజుల ప్రణాళిక ప్రధాన లక్ష్యమని అధికారులకు సీతక్క స్పష్టం చేశారు. ఇతర మంత్రులు కూడా ఆయా జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్ణీత సమయంలోనే తమ లక్ష్యాలను పూర్తి చేసి జవాబుదారీతనం నిరూపించుకోవాలని స్పష్టం చేశారు.
