ఇరాన్‌ యుద్ధంలో అమెరికా కొత్త అస్త్రం.. తొలిసారిగా ప్రిసిషన్‌ స్ట్రైక్‌ మిస్సైల్‌ వినియోగం 

ఇరాన్‌ యుద్ధంలో అమెరికా కొత్త అస్త్రం.. తొలిసారిగా ప్రిసిషన్‌ స్ట్రైక్‌ మిస్సైల్‌ వినియోగం 
  • 500 కి.మీ. లక్ష్యాన్ని చేరుకునేలా క్షిపణి డిజైన్‌

వాషింగ్టన్‌:  ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో అమెరికా తన అత్యాధునిక ‘ప్రిసిషన్‌ స్ట్రైక్‌ మిస్సైల్‌ (పీఆర్‌‌ఎస్‌ఎం)’లను తొలిసారిగా ప్రయోగించింది. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ (సెంట్‌కామ్‌) ధ్రువీకరించింది. గత బుధవారం వీటిని ప్రయోగించినట్లు సెంట్‌కామ్‌ చీఫ్‌ అడ్మిరల్‌ బ్రాడ్‌ కూపర్ తెలిపారు. అయితే, ఈ క్షిపణులను ఎక్కడి నుంచి ప్రయోగించారు.. ఇరాన్‌లోని ఏయే లక్ష్యాలపై ప్రయోగించారనే వివరాలను గోప్యంగా ఉంచారు. 

ప్రిసిషన్‌ స్ట్రైక్‌ మిస్సైల్‌ అనేది దూరంగా ఉన్న లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించే మిస్సైల్‌. దీనిని అమెరికాకు చెందిన ప్రముఖ రక్షణ రంగ సంస్థ లాక్‌ హీడ్‌ మార్టిన్‌ అభివృద్ధి చేసింది. 2023 డిసెంబర్‌‌లో ఇవి తొలిసారిగా అమెరికా సైన్యానికి అందాయి. ఈ మిస్సైల్స్‌ 60 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న లక్ష్యాలను చేరుకోగలవు. హిమార్స్‌, ఎం270 మల్టీపుల్‌ లాంచ్‌ రాకెట్‌ సిస్టమ్స్‌ ద్వారా వీటిని ప్రయోగించవచ్చు. 

ఇందులో ఇన్‌సెన్సిటివ్‌ మ్యునీషన్స్‌ (ఐఎం) టెక్నాలజీని వాడటం వల్ల ప్రమాదవశాత్తు ఈ మిసైల్‌కు మంటలు అంటుకున్నా పేలవు. ఇతర పేలుళ్లు జరిగినా ఇవి పేలుడుకు గురికావు. నిర్దేశిత లక్ష్యాన్ని తాకినప్పుడు మాత్రమే ఇవి పేలుతాయి. ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీలో భాగంగా అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాలు ఈ మిస్సైల్స్‌ను ప్రయోగించాయి. ఇరాన్‌ సరిహద్దులకు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న కువైట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్‌, ఖతర్‌‌ వంటి దేశాల్లోని అమెరికా స్థావరాల నుంచి వీటిని ప్రయోగించే అవకాశం ఉంది.