45 రోజుల్లో టారిఫ్ డబ్బు రీఫండ్.. రూ.14 లక్షల కోట్లు చెల్లింపునకు అమెరికా ఏర్పాట్లు

45 రోజుల్లో టారిఫ్ డబ్బు రీఫండ్.. రూ.14 లక్షల కోట్లు చెల్లింపునకు అమెరికా ఏర్పాట్లు

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ హయాంలో దిగుమతిదారులపై విధించిన టారిఫ్స్ విషయంలో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. ఆ సుంకాలు చెల్లనివని అమెరికా సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో.. సుమారు 166 బిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీ లెక్కల ప్రకారం దాదాపు రూ.14 లక్షల కోట్ల భారీ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ సిద్ధమవుతోంది. కేవలం 45 రోజుల్లోనే ఈ రీఫండ్ ప్రక్రియను పూర్తి చేసేలా ఒక కొత్త వ్యవస్థను రూపొందిస్తున్నట్లు అధికారులు చెప్పారు.

ఈ భారీ రీఫండ్ ప్రక్రియ ద్వారా దాదాపు 3లక్షల 30వేల మంది దిగుమతిదారులు ప్రయోజనం పొందనున్నారు. ఇందులో ఫెడెక్స్, లోరియల్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు వేల సంఖ్యలో చిన్న తరహా వ్యాపారాలు కూడా ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి రీఫండ్‌ల కోసం కంపెనీలు కోర్టుల్లో విడివిడిగా కేసులు వేయాల్సి ఉంటుంది. కానీ తాజా ప్రతిపాదన ప్రకారం.. దిగుమతిదారులు ఎలాంటి న్యాయపరమైన పోరాటాలు చేయాల్సిన అవసరం లేకుండానే నేరుగా తమ సొమ్మును తిరిగి పొందవచ్చు.

రీఫండ్ ఎలా పొందాలనే అంశంపై అధికారి బ్రాండన్ లార్డ్ స్పష్టతనిచ్చారు. దిగుమతిదారులు కస్టమ్స్ విభాగానికి చెందిన 'ఆటోమేటెడ్ కమర్షియల్ ఎన్విరాన్‌మెంట్' సిస్టమ్ ద్వారా ఒక సాధారణ డిక్లరేషన్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అందులో తాము చెల్లించిన సుంకాల వివరాలను తెలియజేయాలి. ఈ వివరాలను అధికారులు తమ వద్ద ఉన్న డేటాతో సరిచూసిన తర్వాత.. అసలు మొత్తంతో పాటు వడ్డీని కలిపి నేరుగా యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ద్వారా ఒకేసారి తిరిగి అందిస్తారు. ఎన్ని సార్లు దిగుమతులు జరిగినా.. అన్ని షిప్‌మెంట్లకు కలిపి ఒకే పేమెంట్ అందజేస్తారు.

ప్రస్తుతం ఉన్న పాత పద్ధతుల్లో ఈ రీఫండ్ ఇవ్వడం అసాధ్యమని అధికారులు కోర్టుకు తెలిపారు. పాత పద్ధతిలో ప్రతి షిప్‌మెంట్ పత్రాలను విడివిడిగా తనిఖీ చేయాల్సి ఉంటుందని, అందుకు దాదాపు 40 లక్షల పని గంటలు అవసరమవుతాయని బ్రాండన్ లార్డ్ పేర్కొన్నారు. అందుకే ఈ కొత్త ఆటోమేటెడ్ ప్రక్రియను తీసుకొస్తున్నారు. అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఈ 45 రోజుల రీఫండ్ ప్రణాళికకు అంగీకారం తెలిపింది. ముఖ్యంగా చిన్న వ్యాపారులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా డబ్బులు వెనక్కి రావడం గొప్ప విషయమని ప్రశంసించింది.

అయితే ఈ ప్రక్రియలో ఒక చిన్న అడ్డంకి కూడా ఉంది. మొత్తం 3.3 లక్షల మంది దిగుమతిదారులు ఉండగా.. ఫిబ్రవరి నాటికి కేవలం 21,423 మంది మాత్రమే ఎలక్ట్రానిక్ రీఫండ్ సిస్టమ్‌లో నమోదు చేసుకున్నారు. మిగిలిన వారు కూడా త్వరగా నమోదు చేసుకుంటేనే ఈ 45 రోజుల గడువులోగా రీఫండ్ అందే అవకాశం ఉంటుంది. సో ఇప్పటి వరకూ నమోదు చేసుకోని వ్యాపారులు వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయటం ద్వారా తాము చెల్లించిన టారిఫ్ మెుత్తాన్ని తిరిగి రీఫండ్ రూపంలో అందుకోవటానికి వీలుంటుంది.