- మద్యం మత్తులో దారుణం
షాద్ నగర్, వెలుగు: మద్యం మత్తులో ఓ భర్త తన భార్యపై బ్లేడ్తో దాడి చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కొందుర్గ్ మండలంలోని గంగన్నగూడెం గ్రామానికి చెందిన పశువుల యాదయ్య, అమృతకు 22 ఏండ్ల కింద పెండ్లి జరగగా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలి పని చేస్తూ జీవించే యాదయ్య గత కొంతకాలంగా మద్యానికి బానిసై, భార్యపై అనుమానంతో తరచూ గొడవ పడేవాడు.
ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన యాదయ్య.. గడ్డం చేసుకోవడానికి బ్లేడ్ తీసుకురావాలని భార్యకు చెప్పాడు. గడ్డం చేసుకున్న తర్వాత మరో బ్లేడ్ కావాలని గొడవకు దిగాడు.
దీంతో రెండో బ్లేడ్ తెప్పించినా ఆగ్రహం తగ్గని యాదయ్య.. అదే బ్లేడ్తో భార్యపై దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో అమృత ఎడమ చేయి, బొటనవేలికి తీవ్ర గాయాలు కాగా, బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
