- రూ.3,500 కోట్లు కొల్లగొట్టారని గుర్తించిన ఈడీ
- కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సహా పలువురి ఆస్తులు స్వాధీనం
హైదరాబాద్,వెలుగు: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన రూ.4 వేల కోట్ల లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుకేసుకుంది. కేసులో ప్రధాన నిందితుడు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సహా ఆయన కుటుంబ సభ్యులు, బూనేటి చాణక్య, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి కుటుంబసభ్యులు, బంధువులు, పలు సంస్థలకు చెందిన రూ.441.63 కోట్ల స్థిర, చరాస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది.
స్థిరచరాస్తులతో పాటు బ్యాంకు బ్యాలెన్స్‌లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, భూములను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) 2002 ప్రకారం అటాచ్ చేసింది. ఈ వివరాలను ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
ప్రభుత్వ ఖజానాకు రూ.3500 కోట్లు నష్టం
లిక్కర్‌స్కామ్‌కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సహా బూనేటి చాణక్య, ముప్పిడి అవినాశ్ రెడ్డి, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, పైల దిలీప్, సైఫ్ అహ్మద్ కలిసి కిక్ బ్యాక్స్ రూపంలో రూ.3,500 కోట్లు మనీలాండరింగ్ పాల్పడ్డారు. ఇలా సంపాదించిన సొమ్ముతో అనేక డిస్టిలరీలను స్థాపించారు. లిక్కర్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలు, ప్యాకేజింగ్ వస్తువులను సరఫరా చేయడానికి నకిలీ విక్రేతలను సృష్టించారు.
సరఫరా చేయని వస్తువుల పేరిట నకిలీ ఇన్‌వాయిస్ తయారు చేసి బ్యాంకింగ్ నిధులను లెక్కలో లేని నగదుగా మార్చారు. ఇలా వచ్చిన సొమ్ముతో రియల్ ఎస్టేట్ నిర్వహించి, భూములు కొనుగోలు చేశారు. ఒల్విక్, క్రిపతి, నైస్నా మల్టీవెంచర్స్, అరోయో, డీ-కార్ట్ వంటి షెల్ ఎంటీటీల ద్వారా ఫండ్స్ లేయరింగ్ చేశారు. ఇలా నెలకు రూ.100 కోట్ల అక్రమంగా సంపాదించినట్లు ఈడీ దర్యాప్తులో వెలుగు చూసింది.
మొత్తం రూ.1048.45 కోట్ల మనీ ట్రయల్ గుర్తించారు. నగదు, బంగారు రూపంలో కిక్‌బ్యాక్‌లు హైదరాబాద్‌లోని వివిధ చోట్ల నిల్వ ఉంచినట్లు ఈడీ తేల్చింది. హ్యాండ్లర్ల ద్వారా నగదు ట్రాన్స్‌పోర్ట్ చేసినట్లు ఆధారాలు సేకరించింది. ఈ మేరకు కేసిరెడ్డి రాజశేర్ రెడ్డి సహా సిండికేట్‌లో కీలకంగా వ్యవహరించిన నిందితులకు చెందిన రూ.రూ. 441.63 కోట్ల ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసినట్లు ఈడీ వెల్లడించింది. దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపింది.
