
- నిలిచిన రాకపోకలు
- జల దిగ్బంధంలో దిందా గ్రామం
- మూడు రోజులుగా కరెంట్ లేక గ్రామస్తుల ఇబ్బందులు
ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. ప్రాణహిత, వార్దా నది, పెద్దవాగు ఉధృతితో తీర ప్రాంతాలైన చింతలమానేపల్లి, కౌటాల, బెజ్జూర్ మండలాల్లో పంటలు నీటమునిగాయి. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది పుష్కర ఘాట్ ను తాకుతూ ప్రవహిస్తోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా వరద పెరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
చింతలమానేపల్లి మండలం గూడెం నుంచి బెజ్జూర్ వెళ్లే మార్గంలో శివపల్లి దగ్గర రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. పెంచికలపేట్ మండలం మేరుగూడ రోడ్డు పూర్తిగా బురదమయమైంది. గ్రామాల్లో పారిశుధ్య లోపం కారణంగా దోమలు పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
ఇండ్లకే పరిమితమైన దిందా ప్రజలు
చింతలమానే పల్లి మండలం దిందా గ్రామానికి వెళ్లేందుకు మూడో రోజూ సాధ్యం కాలేదు. ఊరికి ముందున్న వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఓవైపు వాగులు, మరోవైపు ప్రాణహిత నది ప్రవాహానికి దిందా గ్రామం జల దిగ్బంధంలో ఉంది. ప్రజలు ఎటూపోలేని స్థితిలో ఇండ్లకే పరిమితమయ్యారు. ఇక్కడ మూడు రోజుల కింద కరెంట్సరఫరా నిలిచిపోయింది. విద్యుత్అధికారులు, సిబ్బంది ఊళ్లోకి వెళ్లే అవకాశం లేకపోవడంతో పునరుద్ధరణ జరగలేదు.
ప్రజలు సెల్ ఫోన్లు, ఛార్జింగ్ లైట్లను ట్రాక్టర్లకు చార్జింగ్ పెట్టుకుంటున్నారు. రాత్రిళ్లు క్యాండిళ్లు, దీపాలు వెలిగించుకుంటున్నామని, నిత్యావసర సరుకులు కూడా పూర్తిగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెరమెరి మండలం అనార్ పల్లి, లక్మాపూర్ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
30 కి.మీ. ప్రయాణించి జిల్లా కేంద్రానికి..
ఆసిఫాబాద్ మండలం గుండి పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో స్థానికులు 30 కిలోమీటర్ల దూరంగా ఉన్న వాంకిడి మండలం ఖమన గ్రామం మీదుగా జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నారు. ఇదివరకు 2 కిలోమీటర్లు ప్రయాణిస్తే జిల్లా కేంద్రానికి చేరేవాళ్లమని, హాస్పిటళ్లు, నిత్యావసర సరుకుల కోసం ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు.
దహెగాం మండలంలోని లోహ గ్రామానికి వెళ్లే రోడ్డు కోతకు గురైంది. ఏండ్లుగా తమకు మట్టి రోడ్డే దిక్కవుతోందని, వానాకాలం వస్తే ప్రయాణ కష్టాలు మొదలవుతాయని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికైనా తమ ఊరుకు రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు. కాగా వాగుల వద్ద పోలీస్అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు.