- ప్రైవేట్ ఫార్మసీ, ఆర్కిటెక్చర్ ఫీజులు ఖరారు చేసిన సర్కారు
- 2025-28 విద్యా సంవత్సరానికి కొత్త ఫీజులు అమలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీల్లో కొత్త ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. తెలంగాణ అడ్మిషన్స్, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్సీ) సిఫార్సుల మేరకు 2025– 2028 విద్యా సంవత్సరాలకు గాను ఈ ఫీజులను నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా మార్పుల ప్రకారం బీఫార్మసీలో అత్యధికంగా రూ.1.21 లక్షల ఫీజు ఉండగా, ఫార్మాడీలో రూ.1.37 లక్షలుగా ఉంది. గతంతో పోలిస్తే 10 నుంచి 15 శాతం వరకు ఫీజులు పెరిగాయి. ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా జీవో నంబర్ 10 రిలీజ్ చేశారు. రాష్ట్రంలో 120 ప్రైవేటు బీ ఫార్మసీ కాలేజీలున్నాయి. వీటిలో బీ ఫార్మసీకి 2022–25 మధ్య కేవలం మూడు కాలేజీల్లో మాత్రమే లక్ష, ఆపై ఫీజు ఉండేది.
కానీ ఇప్పుడు ఏడు కాలేజీల్లో ఫీజు లక్ష, ఆపైన ఉంటుంది. అత్యధికంగా గురునానక్ కాలేజీలోరూ. 1.21లక్షలుగా ఉంది. గతంతో మాదిరిగా ప్రభుత్వ కనిష్ట ఫీజును రూ.45 వేలకే పరిమితం చేసింది. సుమారు 16 కాలేజీల్లో ఈ ఫీజు ఉంటుంది. మెజారిటీ కాలేజీల్లో ఫీజులు రూ.50 వేల నుంచి రూ.80 వేల మధ్య ఉన్నాయి. 103 కాలేజీల్లో రూ.50 వేలకు పైగా ఫీజు ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన ఈ ట్యూషన్ ఫీజుతో పాటు విద్యార్థులు అడ్మిషన్ల టైమ్‌లో స్పెషల్ ఫీజులు, ఇతర నామమాత్రపు రుసుములను అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
రాష్ట్రవ్యాప్తంగా 79 ఫార్మాడీ కాలేజీలున్నాయి. వీటిలో కనిష్ట ఫీజు రూ.68 వేలుగా ఉండగా, అత్యధికంగా రూ.1,37,500గా ఉంది. గతంలో లక్షకు పైగా ఫీజు ఉన్న కాలేజీలు 9 ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 13కు పెరిగింది. సుమారు 20 కాలేజీల్లో కనిష్ట ఫీజు ఉంది. మరోపక్క, బీ.ఆర్కిటెక్చర్ కాలేజీలు 8 ఉండగా, వీటిలో అత్యధిక ఫీజు రూ.1.32 లక్షలుగా ఉంది. అత్యల్పంగా రూ.65 వేలు ఉంది. అశోక స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లో ఫీజు గతంలో రూ. 1.20 లక్షలు ఉండగా, ఇప్పుడు రూ. 1.32 లక్షలకు పెంచడం గమనార్హం.
ఫార్మసీ కాలేజీల్లో కొత్త ఫీజులు ఇలా.. (రూపాయల్లో..)
కోర్సు కాలేజీలు కనిష్ట ఫీజు గరిష్ట ఫీజు గతంలో గరిష్ట ఫీజు
- బీఫార్మసీ: 120 45,000 1,21,000 1,10,000
- ఫార్మాడీ: 79 68,000 1,37,500 1,25,000
- బీ.ఆర్కిటెక్చర్: 08 77,000 1,32,000 1,20,000
