అప్పులతో ముప్పే : ప్రాజెక్ట్​లు ​లేటై 1.8 లక్షల కోట్ల భారం

అప్పులతో ముప్పే : ప్రాజెక్ట్​లు ​లేటై 1.8 లక్షల కోట్ల భారం

వచ్చే ప్రతి వంద రూపాయల్లో రూ.12.41 వడ్డీకే
అప్పుల రిస్క్​పై స్టడీ చేయించండి: కాగ్​ రిపోర్టు
సాగునీటి ప్రాజెక్టులతో ఫలితాలపైనా అధ్యయనం చేయాలె

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్ చేసిన అప్పులు ముప్పు తెచ్చిపెడుతాయని కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్)​ ఆందోళన వ్యక్తం చేసింది. వాటికి కట్టే వడ్డీల భారం ఇప్పటికే మోయలేనంత పెరిగిపోయిందని తెలిపింది. రాష్ట్రానికి రాబడిగా వచ్చే ప్రతి వంద రూపాయల్లో రూ.12.41 వడ్డీలకే కట్టాల్సి వస్తోందని, ఇది భవిష్యత్తులో ముప్పుగా మారుతుందని హెచ్చరించింది. అప్పులు, వడ్డీలతో తలెత్తే చిక్కులపై రాష్ట్ర సర్కార్ వెంటనే అలర్ట్ కావాలని.. రిస్క్ లేకుండా ఉండేందుకు భవిష్యత్తు రాబడులు, చెల్లింపులపై ప్రత్యేక స్టడీ చేయించాలని చెప్పింది. 2017తో పోలిస్తే 2018లో అప్పులు 18 శాతం పెరిగాయని, 2019 నాటికి మరో 16 శాతం పెరిగినట్లు వెల్లడించింది. ‘‘జీఎస్ డీపీ వృద్ధి రేటును మించి అప్పులు పెరిగిపోయాయి. ఏకంగా14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన వడ్డీ లిమిట్స్ ను దాటిపోయాయి. రెవెన్యూ రాబడిలో వడ్డీల చెల్లింపులు 8.37 శాతం మించకూడదని ఆర్థిక సంఘం చెప్పింది. కానీ తెలంగాణ కట్టే వడ్డీలు 12.41 శాతం ఉండటం చాలా ఎక్కువ’’ అని కాగ్ చెప్పింది. 2019 మార్చి నాటికి రాష్ట్రానికి ఉన్న అప్పులు  రూ.1.65 లక్షల కోట్లు. అప్పులు తీసుకున్న గడువు ప్రకారం వచ్చే ఏడేండ్లలో 46 శాతం అప్పులు (రూ.76,262 కోట్లు) తిరిగి చెల్లించాల్సి ఉందని పేర్కొంది. 2018 – 2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ రిపోర్టుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ పలుచోట్ల అక్షింతలు వేసింది. రోజువారీ నగదు నిల్వ నిర్వహణ గాడి తప్పిందని.. కావాల్సినంత నిల్వ లేకపోవటంతో ఏడాదిలో ఎక్కువ రోజులు వేస్ అండ్ మీన్స్ ద్వారా తెచ్చుకునే చేబదులుపై ఆధారపడుతోందని వివరించింది.

అప్పులన్నీ కాళేశ్వరం, భగీరథకే 

కాళేశ్వరం ప్రాజెక్టుకు తక్షణ అవసరం లేకున్నా రూ.539 కోట్లు అప్పు తీసుకొని.. అనవసరంగా రూ.8.51 కోట్ల వడ్డీ చెల్లించడాన్ని తప్పుబట్టింది. కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల పేరిట తెచ్చిన గ్యారంటీ రుణాలు రూ.77,713 కోట్లు కాగా, వీటిలో 65 శాతం కాళేశ్వరం, మిషన్ భగీరథకే ఖర్చు పెట్టినట్లు కాగ్ చెప్పింది.
ప్రాజెక్ట్​లు ​లేటై 1.8 లక్షల కోట్ల భారం
రాష్ట్రంలో ప్రాజెక్టులు లేటయ్యే కొద్దీ.. వాటి ఖర్చు భారీగా పెరుగుతోందని కాగ్ తెలిపింది. పెట్టుబడి వ్యయంలో ప్రాజెక్టులకే  ఎక్కువ ఖర్చు చేసింది. అయినా నిర్మాణంలో ఉన్న 26 ప్రాజెక్టుల్లో 20 ప్రాజెక్టులు లేటు అయ్యాయి. ఇప్పటికే వీటికి రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టింది. లేటుతో రూ.1.8 లక్షల కోట్ల అదనపు భారం పడుతోందని పేర్కొంది.
నికరంగా లోటు బడ్జెటే
మిగులు రెవెన్యూ లేదని, రాష్ట్రం నికరంగా లోటు బడ్జెట్​లోనే ఉందని కాగ్ తేల్చింది. 2017–18లో రూ.3,459 కోట్ల మిగులు బడ్జెట్ నమోదు చేసినప్పటికీ ఆదాయ ఖర్చుల ఖాతాల ప్రకారం రూ.284.74 కోట్ల లోటులో ఉంది. 2018–19లోనూ రూ. 4,337 కోట్ల మిగులు చూపించినా.. రూ. 5,144 కోట్ల లోటు నమోదైంది.