18,500 నాసిరకం బొమ్మల సీజ్​

18,500 నాసిరకం బొమ్మల సీజ్​

న్యూఢిల్లీ: దేశంలోని పెద్ద రిటెయిల్​ స్టోర్లు హామ్లేస్​, ఆర్చీస్​తోపాటు మాల్స్​లో గత నెల రోజులలో 18,500 నాసిరకం బొమ్మలను ప్రభుత్వ అధికారులు సీజ్​ చేశారు. బీఐఎస్​ క్వాలిటీ స్టాండర్డ్స్​ను పాటించకపోవడం వల్లే ఈ బొమ్మలను సీజ్​ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు,  టాయ్స్​ కంట్రోల్​ ఆర్డరులోని రూల్స్​ను పాటించనందుకు ఆన్​లైన్​ కంపెనీలయిన  అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​, శ్నాప్​డీల్​లకు కన్జూమర్​ ప్రొటెక్షన్​ రెగ్యులేటర్​ సీసీపీఏ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించింది. బ్యూరో ఆఫ్​ ఇండియన్​ స్టాండర్డ్స్​ (బీఐఎస్​) ప్రమాణాలు పాటించడం ఈ ఏడాది జనవరి 1 నుంచి తప్పనిసరని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. కొంత మంది దేశీయ తయారీదారులు బొమ్మల తయారీలో ప్రమాణాలు పాటించడం లేదనే కంప్లెయింట్లు రావడంతో, గత నెల రోజులలో 44 రెయిడ్స్​ నిర్వహించినట్లు బీఐఎస్​ డైరెక్టర్​ జనరల్​ ప్రమోద్​ కుమార్​ తివారీ మీడియాకు వెల్లడించారు. సీజ్​ చేసిన బొమ్మలలో దేశంలో తయారైన వాటితోపాటు, దిగుమతి చేసుకున్నవీ ఉన్నట్లు చెప్పారు. కొన్ని బొమ్మలపై బీఐఎస్​ క్వాలిటీ మార్క్​ జాడే లేదని పేర్కొన్నారు. మరికొన్నింటిపై ఫేక్​ బీఐఎస్​ లైసెన్స్​ నెంబర్​ ఉన్నట్లు గుర్తించామని అన్నారు. 

పెద్ద రిటెయిలర్లపై ఫోకస్​....

దేశంలోని ఎయిర్​పోర్టులు, మాల్స్​లో ఉన్న హామ్లేస్​, ఆర్చీస్​, డబ్ల్యూహెచ్​ స్మిత్​, కిడ్స్​ జోన్, కోకోఆర్ట్​ వంటి రిటెయిల్​ స్టోర్లపై ఈ  రెయిడ్స్​ నిర్వహించినట్లు తివారీ వెల్లడించారు. న్యూఢిల్లీ, కోల్​కతా, రాంచి, నోయిడా, శాస్​ నగర్​ (పంజాబ్) లలోని స్టోర్ల నుంచి బొమ్మలను సీజ్​ చేసినట్లు అధికారులు తెలిపారు. ఘజియాబాద్​లోని పసిఫిక్​ మాల్​, హైదరాబాద్, ఢిల్లీల​లోని డబ్ల్యూహెచ్​ స్మిత్​ స్టోర్ల నుంచి కూడా నాసిరకం బొమ్మలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అహ్మదాబాద్​లోని రాజ్​ టాయ్​ వరల్డ్​ నుంచి ఏకంగా 9 వేల బొమ్మలను సీజ్​ చేశారు. మదురైలోని గిఫ్ట్​జ్​నుంచి 3,080, బెంగళూరులోని రాయల్​ మార్ట్​ నుంచి 2 వేల బొమ్మలను ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేశంలోని బొమ్మల షాపులపై నిఘా పెట్టామని, దశల వారీగా సోదాలు నిర్వహిస్తామని తివారీ వెల్లడించారు. మొదటి దశలో పెద్ద రిటెయిలర్లు, ఎయిర్​పోర్టులు, మాల్స్​లోని స్టోర్లపై ఫోకస్​ పెట్టినట్లు చెప్పారు. ఆ తర్వాత దశలో చిన్న రిటెయిలర్లు, మాన్యుఫాక్చరర్లపైనా దృష్టిపెట్టనున్నామని అన్నారు. బీఐఎస్​ రూల్స్​ను పాటించని రిటెయిలర్లపై లీగల్​ యాక్షన్​ తీసుకోనున్నట్లు చెబుతూ, మొదటిసారి తప్పు చేసినందుకు రూ. లక్ష దాకా పెనాల్టీతోపాటు, జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుందని తివారీ చెప్పారు. టాయ్స్​ కంట్రోల్​ ఆర్డరును పాటిస్తున్నాయా లేదా అనే కోణంలో  మరోవైపు ఆన్​లైన్ బిజినెస్​లపై సెంట్రల్​ కన్జూ మర్​ ప్రొటెక్షన్​ అథారిటీ (సీసీపీఏ) దృష్టి సారిస్తోంది. బీఐఎస్​ మార్కు లేని బొమ్మలను అమ్ముతున్నందుకు  అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​, శ్నాప్​డీల్​ కంపెనీలకు నోటీసులు జారీ చేసినట్లు తివారీ వెల్లడించారు. దిగుమతి చేసుకునే బొమ్మలు మన స్టాండర్డ్స్​కు తగినట్లుగా ఉన్నాయా లేదా చూసేందుకు కస్టమ్స్​ అధికారులతో కలిపి జాయింట్​ గ్రూప్​ను ఏర్పాటు చేసినట్లు కన్జూమర్​ అఫైర్స్​ సెక్రటరీ రోహిత్ కుమార్​ సింగ్​ చెప్పారు. దీంతో అలాంటి బొమ్మలు దేశంలోకి రాకుండానే ఆపడం వీలవుతుందని పేర్కొన్నారు. బీఐఎస్​ రూల్స్​ ప్రకారం ప్రొడక్ట్ డిక్లరేషన్​ను తమ ప్లాట్​ఫామ్స్​లో ఉంచేందుకు ఆన్​లైన్​ బిజినెస్​ కంపెనీలు అంగీకరించినట్లు ఆయన చెప్పారు.