నీట్​ చిచ్చు.. తండ్రీకొడుకుల ఆత్మహత్య

నీట్​ చిచ్చు.. తండ్రీకొడుకుల ఆత్మహత్య

చెన్నై: ‘నీట్‌‌‌‌’ కోచింగ్ తీసుకున్నాడు.. రెండు సార్లు పరీక్ష రాసినా క్వాలిఫై కాలేకపోయాడు.. అప్పటికీ ధైర్యంగానే ఉన్నాడు. ‘నాన్న.. నువ్వు ఫీజు కట్టు.. ఈ సారి కచ్చితంగా క్వాలిఫై అవుతా’ అని కాన్ఫిడెంట్‌‌‌‌గా చెప్పాడు. కష్టపడినా నీట్‌‌‌‌కు అర్హత సాధించలేకపోతున్నాన్న బాధనో, మూడోసారి కూడా ఫెయిల్‌‌‌‌ అయితనేమోనని భయమో.. ఏమైందో ఏమో ఉరేసుకుని చనిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు మృతదేహాన్ని చూసి ఆ తండ్రి విలవిల్లాడాడు. కొడుకు అంత్యక్రియలు చేసి.. తాను బలన్మరణానికి పాల్పడ్డాడు. చెన్నైలో జరిగిందీ విషాద ఘటన.

ఇంకోసారి పరీక్ష రాస్తానన్నడు

చెన్నైకి చెందిన పి.సెల్వశేఖర్(48) ఫొటోగ్రాఫర్. అతడి కొడుకు జగదీశ్వరన్ (19 ).. సీబీఎస్‌‌‌‌సీ సిలబస్ ఉన్న స్కూలులో ప్లస్ 2లో 500కు 427 మార్కులతో పాస్ అయ్యాడు. మెడిసిన్​ చదవాలన్న లక్ష్యంతో ‘నీట్’ కోసం కోచింగ్ తీసుకున్నాడు. రెండుసార్లు రాసినా క్వాలిఫై కాలేదు. ఎలాగైనా నీట్‌‌‌‌లో అర్హత సాధిస్తానని కాన్ఫిడెంట్‌‌‌‌గా ఉన్న అతడు.. కోచింగ్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో ఫీజు కట్టాలని తండ్రికి చెప్పాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి  జగదీశ్వరన్‌‌‌‌కు తండ్రి ఫోన్ చేస్తే తగల్లేదు. దీంతో ఫ్రెండ్‌‌‌‌తో కలిసి వెళ్లి చూడగా.. క్రోమెపేట్‌‌‌‌లోని కురింజి నగర్‌‌‌‌‌‌‌‌లో గదిలో ఉరి వేసుకుని కనిపించాడు. 

వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. తన కొడుకు మృతిపై ఆదివారం స్పందించిన సెల్వశేఖర్.. ‘‘చదువుల కోసం తన అన్నతో కలిసి విదేశాలకు వెళ్లమని చెప్పాను. కానీ ఇంకోసారి పరీక్ష రాస్తానని చెప్పాడు. క్వాలిఫై అవుతానని, మెడికల్ కాలేజీలో చేరుతానని ధీమాగా చెప్పాడు’’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కొడుకు అంత్యక్రియలను నిర్వహించిన సెల్వశేఖర్.. ఆదివారం రాత్రి తాను కూడా ఉరి వేసుకుని చనిపోయాడు. 

ఆత్మహత్యల ఆలోచన వద్దు: స్టాలిన్

స్టూడెంట్లు ఆత్మహత్యలు చేసుకోవద్దని, జీవితాన్ని ఆత్మ విశ్వాసంతో ఎదుర్కోవాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కోరారు. జగదీశ్వరన్, అతడి తండ్రి సెల్వశేఖర్‌‌‌‌‌‌‌‌ మృతిపై ప్రగాడ సానుభూతి తెలిపారు. కొన్ని నెలల్లోనే రాజకీయ మార్పులు చోటుచేసుకుంటాయని, ఆ తర్వాత నీట్‌‌‌‌ను తొలగిస్తామని చెప్పారు. కాగా, అసెంబ్లీ పాస్ చేసి పంపిన ‘నీట్’ వ్యతిరేక బిల్లుకు వెంటనే ఆమోద ముద్ర వేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. నీట్​ రద్దుద్వారా తమిళనాడులో విద్యార్థుల ఆత్మహత్యలను నివారించవచ్చని లేఖలో పేర్కొన్నారు.