బంగ్లాకు షాక్.. 307 లక్ష్యాన్ని అవలీలగా చేధించిన జింబాబ్వే

బంగ్లాకు షాక్.. 307 లక్ష్యాన్ని అవలీలగా చేధించిన  జింబాబ్వే

క్రికెట్ లో ఏదైనా జరగొచ్చు అనేది మరోసారి రుజువైంది. పసికూన , చిన్న టీమ్ అనే డైలాగ్స్ వినిపిస్తుంటాయి. కానీ మేమేమీ తక్కువ కాదని జింబాబ్వే నిరూపించింది. డేంజర్ బంగ్లా టైగర్స్ పై అద్భుతమైన విక్టరీ సాధించింది.  శుక్రవారం జరిగిన వన్డే మ్యాచ్ లో 304 టార్గెట్ ను మరో 10 బాల్స్ ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి బంగ్లాకు షాక్ ఇచ్చింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల మాత్రమే కోల్పోయి 303 భారీ స్కోర్ చేసింది. ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన బంగ్లా వికెట్ తీయాలంటేనే జింబాబ్వే బౌలర్లకు చాలా కష్టమైంది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ ప్లేయర్లందరూ మ్యాచ్ వన్ సైడ్ అనుకున్నారు. చెలరేగి ఆడారు. 

లక్ష్య ఛేదనలో జింబాబ్వేకు ప్రారంభంలోనే బిగ్ షాక్ తగిలింది. 6 పరుగులకే రెండు వికెట్లు.. 62 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయిన జింబాబ్వే పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన ఇన్నోసెంట్‌ కాయా, సికందర్‌ రజాలు ఇన్నింగ్స్‌ను నడిపించిన తీరు ఆహా అంటారు.  కాయా 122 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 110 పరుగులు.. సికందర్‌ రజా 109 బంతుల్లో 135 నాటౌట్‌, 8 ఫోర్లు, 6 సిక్సర్లు) విలువైన ఇన్నింగ్స్‌ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ ఇద్దరి మధ్య నాలుగో వికెట్‌కు 192 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. జింబాబ్వే క్రికెట్‌ చరిత్రలో ఈ ఇద్దరి భాగస్వామ్యం మూడో అత్యుత్తమం కావడం విశేషం. ఇంతకముందు 2014లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హామిల్టన్‌ మజకద్జ, సికందర్‌ రజాలు 224 పరుగులతో తొలి స్థానంలో ఉన్నారు.

జింబాబ్వే రికార్డులు

జింబాబ్వేకు ఇది మూడో అత్యుత్తమ చేజింగ్‌ కావడం విశేషం. 11 ఏళ్ల క్రితం బులవాయో వేదికగా కివీస్‌తో మ్యాచ్‌లో జింబాబ్వే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించింది. 2022లో జింబాబ్వేకు ఇది రెండో వన్డే విజయం. ఈ ఏడాది జనవరిలో పల్లెకెలే వేదికగా జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే లంకకు షాక్‌ ఇచ్చింది.  బంగ్లాదేశ్‌పై ఒక వన్డేలో విజయం సాధించడానికి జింబాబ్వేకు 9 ఏళ్లు పట్టింది. ఆఖరిసారి  మే 2013లో బులవాయో వేదికగా జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే బంగ్లాపై విజయం అందుకుంది. ఈ 9 ఏళ్ల కాలంలో జింబాబ్వే బంగ్లాదేశ్‌ చేతిలో వరుసగా 19 వన్డేల్లో పరాజయం చవిచూసింది. అయితే జింబాబ్వే ఈ విజయాలు బంగ్లాదేశ్‌పై సాధించడం తీసిపారేయాల్సిన విషయం కాదు. ఎందుకంటే రోజురోజుకు జింబాబ్వే పటిష్టంగా తయారవుతోంది. పెద్ద జట్లను ఓడించలేకున్నా.. అఫ్గనిస్తాన్‌, ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌ లాంటి జట్లకు షాకివ్వడం ఖాయం.