ధరణిలో 2 లక్షల 37 వేల.. అప్లికేషన్లు పెండింగ్​

ధరణిలో  2 లక్షల 37 వేల..  అప్లికేషన్లు పెండింగ్​
  • ధరణిలో మొత్తం అప్లికేషన్లు17 లక్షలు.. 2.37 లక్షల దరఖాస్తులు పెండింగ్
  • సగమే పరిష్కారం.. రీజన్ లేకుండానే 5.5 లక్షల దరఖాస్తులు రిజెక్ట్ చేసిన గత సర్కార్​
  • పెండింగ్​లోనే 2.37 లక్షల అప్లికేషన్లు 
  • ధరణిపై కమిటీ సమావేశం.. పోర్టల్ పనితీరుపై చర్చ
  • ధరణితో కొత్తగా అనేక సమస్యలొచ్చాయన్న సభ్యులు 
  • 22న మరోసారి భేటీ అయ్యాక పూర్తి వివరాలు చెప్తామని వెల్లడి  

హైదరాబాద్, వెలుగు :  ధరణి పోర్టల్​లో వివిధ సమస్యలపై 17 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో సగమే పరిష్కారం కాగా.. ఐదున్నర లక్షల అప్లికేషన్లు రీజన్ లేకుండానే గత ప్రభుత్వం​ రిజెక్ట్ చేసింది. ఇంకా 2.37 లక్షల దరఖాస్తులు పెండింగ్​లో ఉన్నాయి. పెండింగ్​ అప్లికేషన్లలో అత్యధికంగా టీఎం 33 మాడ్యుల్ కింద అప్లై చేసుకున్నవే ఉన్నట్లు అధికారులు గుర్తించారు.  

ధరణిలో 35 రకాల మాడ్యుల్స్​ తెచ్చినప్పటికీ భూ సమస్యలు పరిష్కారం కాలేదని ఈ పోర్టల్ పై ఏర్పాటైన కమిటీ నిర్ధారించింది. బుధవారం సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ అధ్యక్షతన సమావేశమైన కమిటీ ధరణి పోర్టల్​లోని సమస్యలు, పోర్టల్ రీకన్ స్ర్టక్షన్​పై చర్చించింది.  కమిటీ మొదటి సమావేశంలో చర్చించిన మేరకు ధరణిలో ఏయే మాడ్యుల్ కింద ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి? ఎన్ని రిజెక్ట్ అయ్యాయి? అసలు ధరణి పనితీరు ఎలా ఉందనేదానిపై నవీన్ మిట్టల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్​ ద్వారా సభ్యులకు వివరించారు. 

‘ది తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్ యాక్ట్–2020’లో పేర్కొన్న హక్కుల గురించి కూడా సమావేశంలో చర్చించారు. మీటింగ్ తర్వాత సెక్రటేరియెట్ మీడియా సెంటర్​లో కమిటీ సభ్యులు సీఆర్పీఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చిరెడ్డి, భూమి సునీల్, కోదండరెడ్డి మీడియాతో మాట్లాడారు. ధరణి విషయంలో తొందరపాటు లేకుండా జాగ్రత్తగా అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. సీసీఎల్ఏలో ఏం జరిగిందనే దానిపై పూర్తిగా మాట్లాడతామన్నారు. ధరణి ఎవరినీ వదిలిపెట్టలేదన్నట్లుగా ఎన్నో సమస్యలను తెచ్చిందన్నారు. ఏ సమస్య కింద అప్లికేషన్ వచ్చినా.. అది ఆన్ లైన్ లో ఎంట్రీ అయితేనే పరిష్కారం దొరుకుతోందన్నారు. సోమవారం మరోసారి సమావేశమై పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.