స్కూల్ ప్రిన్సిపాల్ను చంపిన ఇద్దరు స్టూడెంట్స్ : కారణం తెలిసి షాక్ అయిన పోలీసులు, పేరంట్స్

స్కూల్ ప్రిన్సిపాల్ను చంపిన ఇద్దరు స్టూడెంట్స్ : కారణం తెలిసి షాక్ అయిన పోలీసులు, పేరంట్స్

గురు పౌర్ణమి రోజు గురువుపై దాడి.. విద్యాబుద్దులు నేర్పిన టీచర్ పైనే దాడి చేశారు విద్యార్థులు.. పెన్ను పట్టి చక్కగా విద్యాబుద్దులు నేర్చుకొని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన వయసులో కత్తి పట్టి క్రిమినల్స్ గా మారారు. గురు పౌర్ణమి రోజు పాఠశాల ప్రిన్సిపాల్ ను ఇద్దరు విద్యార్థులు చంపిన ఘటన హర్యానాలో జరిగింది.  పూర్తి వివరాల్లోకి వెళితే. 

హర్యానాలో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. జుట్టు కత్తిరించుకోమని మందలించినందుకు ఇద్దరు మైనర్ విద్యార్థులు తమ పాఠశాల ప్రిన్సిపాల్‌ను కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటన గురువారం(జూలై 10, 2025న) హిసార్ జిల్లాలోని నార్నౌండ్ పట్టణంలోని బాస్ గ్రామంలోని కర్తార్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో జరిగింది.

మృతుడు ప్రిన్సిపాల్ జగ్బీర్ సింగ్(50) గా గుర్తించారు పోలీసులు.  నిందితులు ఇద్దరు మైనర్ విద్యార్థులు. వీరు 12వ తరగతి చదువుతున్నట్లు తెలుస్తోంది. ప్రిన్సిపాల్ జగ్బీర్ సింగ్ ఆ విద్యార్థులను క్రమశిక్షణతో ఉండాలని, జుట్టు కత్తిరించుకొని పాఠశాలకు రావాలని మందలించారు. దీనిపై ఆగ్రహించిన విద్యార్థులు ఈ దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. 

ALSO READ | కెనడాలో గాల్లోనే ఢీకొన్న విమానాలు.. కేరళకు చెందిన ట్రైనీ పైలట్ మృతి

విద్యార్థులు ఫోల్డింగ్ కత్తిని ఉపయోగించి ప్రిన్సిపాల్‌ను పలుమార్లు పొడిచారు. ప్రిన్సిపాల్ అక్కడికక్కడే మృతిచెందారు. దాడి జరిగిన తర్వాత విద్యార్థులు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. దాడికి ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రిన్సిపాల్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హిసార్‌కు తరలించారు.

హన్సి ఎస్పీ అమిత్ యశోవర్ధన్ మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితులు ఏదైనా గ్యాంగ్ లేదా బయటి వ్యక్తుల ప్రభావానికి లోనయ్యారా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటన పాఠశాల ప్రాంగణంలో తీవ్ర భయాందోళనలను సృష్టించింది. గురు పౌర్ణమి రోజున ఈ దురదృష్టకర సంఘటన జరగడం విషాదకరం.