కెనడాలో గాల్లోనే ఢీకొన్న విమానాలు.. కేరళకు చెందిన ట్రైనీ పైలట్ మృతి

కెనడాలో గాల్లోనే ఢీకొన్న విమానాలు.. కేరళకు చెందిన ట్రైనీ పైలట్ మృతి

న్యూఢిల్లీ: కెనడాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మానిటోబా ప్రావిన్స్‌లోని స్టెయిన్‌బాచ్ సమీపంలో రెండు విమానాలు గాల్లోనే ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మృతుల్లో ఒకరు కేరళకు చెందిన 23 ఏళ్ల ట్రైనీ పైలట్ శ్రీహరి సుఖేష్‎గా అధికారులు నిర్ధారించారు. ప్రమాదం తర్వాత శిథిలాల నుంచి అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 

ఈ మేరకు కెనడాలోని భారత కాన్సులేట్, మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు స్థానిక అధికారులు. మృతుడు శ్రీహరి సుఖేష్ కేరళలోని కొచ్చి నివాసి. పైలట్ శిక్షణ కోసం కెనడా వెళ్లాడు. ట్రైనింగ్‎లో భాగంగా మంగళవారం (జూలై 8) విమానం నడుపుతుండగా మరో విమానం వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  శ్రీహరి సుఖేష్ మృతి చెందాడు. పైలట్ కావాలన్న ఆశతో కెనడాకు వెళ్లిన కొడుకు కోరిక తీరకుండానే విమాన ప్రమాదంలో మృతి చెందడటంతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

కెనడా టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ యువ పైలట్ శ్రీహరి సుఖేష్  మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. మానిటోబాలోని స్టెయిన్‌బాచ్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో భారతీయ యువ ట్రైనీ పైలట్ శ్రీహరి సుకేశ్ ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. శ్రీహరి సుకేశ్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాం.

ALSO READ : రష్యాలో 10 లక్షల ఉద్యోగాలు : ఇండియా వాళ్లకే ఇస్తామంటున్న పుతిన్

మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. మృతుడి కుటుంబానికి అవసరమైన సహయం అందించడానికి పైలట్ శిక్షణ పాఠశాల, స్థానిక పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నాం’’ అని పేర్కొంది కెనడాలోని భారత కాన్సులేట్.  శ్రీహరి సుకేశ్ డెడ్ బాడీ స్వస్థలానికి తరలించేందుకు అధికకారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.