
రష్యా ప్రస్తుతం తీవ్రమైన కార్మిక కొరతను ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం, జనాభా సమస్యలు, వలస కార్మికుల సంఖ్య తగ్గడం వంటివి దీనికి ప్రధాన కారణాలు. ఈ నేపథ్యంలో.. రష్యా 2025 చివరి నాటికి 10 లక్షల మంది భారతీయ కార్మికులను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని వార్తలు వెలువడ్డాయి. ఇది భారతీయ యువతకు, ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక సువర్ణావకాశంగా చెప్పుకోవచ్చు.
రష్యాలో కార్మిక కొరతకు కారణాలు:
1. ఉక్రెయిన్‌తో యుద్ధం: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పెద్ద సంఖ్యలో యువకులు సైన్యంలో చేరడం.. కొందరు యుద్ధంలో ప్రాణాలు కోల్పోవడం వల్ల కార్మిక శక్తి గణనీయంగా తగ్గింది.
2. జనాభా సమస్యలు: రష్యా దశాబ్దాలుగా తక్కువ బర్త్ రేటు, అధిక మరణాలతో జనాభా క్షీణతను ఎదుర్కొంటోంది. ఇది దీర్ఘకాలికంగా కార్మిక కొరతకు దారితీస్తోంది.
3. వలస కార్మికుల తగ్గింపు: గతంలో మధ్య ఆసియా దేశాల నుంచి పెద్ద సంఖ్యలో వలస కార్మికులు రష్యాకు వెళ్లేవారు. అయితే, ఇటీవల కాలంలో వలస విధానాలు కఠినతరం కావడంతో పాటు, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇది తగ్గింది.
4. ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం: యుద్ధం నేపథ్యంలో రష్యా తన ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించుకుంటోంది. రక్షణ పరిశ్రమ, నిర్మాణ రంగం వంటి కొన్ని రంగాల్లో డిమాండ్ విపరీతంగా పెరగటంతో.. దానికి తగినంత మంది కార్మికులు అందుబాటులో లేక ఇబ్బంది పడుతోంది.
5. తక్కువ వేతనాలు, పని పరిస్థితులు: కొన్ని రంగాల్లో వేతనాలు తక్కువగా ఉండటం, పని పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోవడం వల్ల స్థానిక రష్యన్ యువత పరిశ్రమల్లో పని చేయడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
భారతీయ కార్మికులకు అవకాశాలు:
రష్యాలో ఉన్న కార్మిక కొరతను అధిగమించడానికి, భారతీయ కార్మికులు ఒక ముఖ్యమైన వనరుగా పరిగణించబడుతోంది. ముఖ్యంగా నిర్మాణ రంగం, వస్త్ర పరిశ్రమ, గిడ్డంగులు, డెలివరీ సేవలు, వ్యవసాయం, ఆహార పరిశ్రమల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వెల్లడైంది.
* మాస్కో ప్రాంతంలో దాదాపు 19,000 మంది భారతీయ కార్మికులు అవసరం, ప్రధానంగా టైలర్లు, మెయింటెనెన్స్ వర్కర్లు, టైల్‌మెన్ అవసరం ఉంది.
* అమూర్ ప్రాంతంలో 12,000 మందికి పైగా నిర్మాణ కార్మికులు అవసరం ఉన్నట్లు వెల్లడైంది.
* ఇక లెనిన్‌గ్రాడ్ ప్రాంతంలో వందలాది మంది భారతీయ కార్మికులకు ఉపాధి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది
2025 చివరి నాటికి 10 లక్షల మంది భారతీయ నిపుణులు రష్యాకు, ముఖ్యంగా స్వెర్డ్‌లోవ్స్క్ ప్రాంతానికి వస్తారని రష్యాలోని ఉరల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధిపతి ఆండ్రీ బెస్డిన్ అంచనా వేస్తున్నట్లు ది మాస్కో టైమ్స్ నివేదించింది. యెకాటెరిన్‌బర్గ్‌లో కొత్త భారతీయ కాన్సులేట్ తెరవాలని కూడా యోచిస్తున్నారు. ఇది భారతీయ కార్మికులకు సహాయపడుతుంది. రష్యన్ యజమానులు భారతీయ కార్మికులను అనుభవం, యువత, తక్కువ వేతనాలకు దొరకటం కారణంగా ఆకర్షణీయమైన శ్రామిక శక్తిగా భావిస్తున్నారని తేలింది. అయితే రష్యన్ భాష రాకపోవటం ఒక పెద్ద అడ్డంకిగా విదేశీ కార్మికులు భావిస్తున్నారు. అయితే రష్యాలోని అధిక చలి వాతావరణం కూడా అక్కడికి వెళ్లాలనుకుంటున్న కార్మికులు గమనించాల్సిన విషయం. భారతీయ కార్మికులతో పాటు, శ్రీలంక మరియు ఉత్తర కొరియా నుండి కూడా ఉద్యోగులను నియమించుకోవాలని మాస్కో యోచిస్తోందని బెసెడిన్ తెలిపారు.
►ALSO READ | Tax Raids: పన్నుశాఖ కొత్త బాంబ్.. లగ్జరీ ఇళ్ల యజమానులే టార్గెట్, ఏం చేస్తోందంటే?
రష్యా, భారతదేశాల మధ్య సాంస్కృతిక భేదాలు కూడా ఉంటాయి. ఈ తేడాలను అర్థం చేసుకోవడం, వాటికి అనుగుణంగా మారడం ముఖ్యం. రష్యా కార్మిక మంత్రిత్వ శాఖ 2025లో విదేశీ కార్మికుల కోసం మొత్తం కోటాను 234,900గా నిర్ణయించింది. ఇందులో భారతీయ పౌరులకు 71,817 స్థానాలు కేటాయించారు. అయితే ప్రస్తుత వార్తల ప్రకారం10 లక్షల మంది కార్మికుల నియామకం అనేది ప్రభుత్వ అధికారిక కోటా కంటే చాలా ఎక్కువ. అయితే దీనికి సంబంధించిన స్పష్టమైన విధానాలు, ప్రణాళికలు వెలువడాల్సి ఉంది.