
Income Tax: దేశంలో ఆదాయపు పన్ను శాఖ ఎప్పుడు ఒక్క అడుగు ముందుండేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు పన్ను ఎగవేతలను ఎదుర్కోవటానికి టెక్నాలజీ, ఏఐపై ఆధారపడిన ఆదాయపు పన్ను శాఖ.. ఇకపై భౌతికంగా డబ్బును పన్నుల్లోకి రాకుండా మాయం చేస్తున్న సంపన్నులను టార్గెట్ చేయాలని చూస్తోంది.
ఈ క్రమంలో విలాసవంతమైన ఇళ్లు కలిగిన వ్యక్తులను టార్గెట్ చేస్తూ కొత్త తనిఖీ బృందాలను తీసుకొచ్చింది ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్. ఈ బృందాలు పట్టణాల్లో లగ్జరీ ఇళ్లలో పెట్టుబడులు పెట్టిన లెక్కల్లో చూపని సొమ్మును కనిపెట్టడం, సదరు ప్రాపర్టీలను లెక్కించటం కోసం తీసుకురాబడ్డాయి. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కలకత్తా, మద్రాస్ నగరాల్లో ఈ ప్రత్యేక బృందాలు దాడులు కొనసాగిస్తాయని వెల్లడైంది. ప్రధానమంత్రి 20-పాయింట్ల ఆర్థిక కార్యక్రమానికి అనుగుణంగా ఈ ప్రత్యేక బృందాలను నియమించారు. రానున్న కాలంలో మరిన్ని టీమ్స్ ఇతర హైదరాబాద్, బెంగళూరు, పూణే లాంటి ఇతర మెట్రోపాలిటెన్ నగరాలను కవర్ చేసే అవకాశం ఉందని టాక్స్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ ప్రత్యేక పన్ను బృందాలు భూమి, దాని అమ్మకపు ధర, పునాది ప్రాంతం, నిర్మించిన అంతస్తుల సంఖ్య నుంచి ప్రాపర్టీలకు సంబంధించిన పూర్తి వివరాల గురించి సమాచారాన్ని సేకరిస్తాయి. దీంతో యజమాని ఇచ్చిన ఆస్తి వివరాలు.. వారి తనిఖీల్లో లెక్కించిన విలువలో వ్యత్యాసాలను తనిఖీకి వచ్చిన పన్ను అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వెంటనే నివేదిస్తారు. తనిఖీల్లో వాల్యుయేషన్ 15 శాతం లేదా రూ.25వేలుగా గుర్తిస్తే దానికి సంబంధించి జరిమానా లేదా పన్ను వసూలు చర్యలను ఆదాయపు పన్ను శాఖ ప్రారంభిస్తుంది.
ALSO READ : లక్ష 12వేల డాలర్లకు బిట్‌కాయిన్ ధర..
ప్రతి తనిఖీ బృందం, సంబంధిత ఆదాయపు పన్ను అధికారులు తీసుకున్న చర్యల గురించి పక్షం రోజులకు ఒకసారి నివేదికలను సమర్పించాల్సి ఉంటుంది. అమ్మకానికి ఆస్తులను తక్కువగా అంచనా వేయడం ద్వారా పన్ను ఎగవేతను గుర్తించటానికి ఆదాయపు పన్ను అధికారులు ప్రారంభించిన చర్యలకు అదనంగా ఈ ప్రత్యేక బృందాల నియామకం జరుగుతోంది. అంటే అమ్మేటప్పుడు లేదా కొన్నప్పుడు ఆస్తి విలువల్లో హెచ్చుతగ్గులు చూపటం తద్వారా పన్ను ఎగవేతలకు పాల్పడటాన్ని ఎదుర్కోవటానికి ఆదాపుపన్ను శాఖ ప్రత్యేక బృందాన్ని వినియోగించుకోనుంది. ఇది నిజంగా రియల్టీ మార్కెట్లోకి వెల్లువలా వస్తున్న పెట్టుబడులు, లెక్కల్లో చూపని డబ్బు, బ్లాక్ మనీని గుర్తించటానికి దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.