
Bitcoin Record Rally: ఈరోజుల్లో ఈక్విటీలతో పాటు క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు మంచి ఆదరణను పొందుతున్నాయి. చాలా మంది క్రిప్టోలను న్యూ ఏజ్ పెట్టుబడి సాధనంగా పరిగణిస్తున్నారు. అయితే వీటిలో కొన్ని గుర్తింపు పొందిన క్రిప్టో కాయిన్స్ మాత్రమే ఫేమస్ అయ్యాయి. ఆల్ట్ కాయిన్లతో ట్రేడింగ్ చేసే వారు మాత్రం జాగ్రత్తగా వ్యవహరించాలని క్రిప్టో నిపుణులు సూచిస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలోనే ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ తొలిసారిగా లక్ష 12వేల డాలర్ల సరికొత్త గరిష్ఠాన్ని తాకి జీవితకాల సరికొత్త రికార్డును సృష్టించింది. గడచిన మూడు నెలల కాలంలో బిట్ కాయిన్ దాదాపు 40 శాతం పెరుగుదలను నమోదు చేసింది. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా టారిఫ్స్ ప్రకటించటం, తాజాగా బ్రెజిల్ దేశంపై 50 శాతం సుంకాలను ప్రకటించటం వంటి చర్యలు క్రిప్టోల ర్యాలీకి కారణంగా నిపుణులు చెబుతున్నారు.
Also Read : మళ్లీ పెరిగిన గోల్డ్ రేటు.. హైదరాబాదులో గురువారం రేట్లివే..
అలాగే క్రిప్టోకరెన్సీలకు ట్రంప్ సర్కార్ మద్దతు వైఖరి డిజిటల్ ఆస్తుల మార్కెట్‌కు గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇచ్చిందని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ ఫ్యామిలీ నేతృత్వంలోని సంస్థ అయిన ట్రంప్ మీడియా & టెక్నాలజీ గ్రూప్, బిట్‌కాయిన్, ఈథర్, సోలానా, రిప్పల్ వంటి క్రిప్టో ఆస్తుల్లో పెట్టుబడి పెట్టే ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ ను రూపొందించాలని యోచిస్తున్నట్లు మంగళవారం యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కు సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్ తెలిపాయి. ఇది కూడా ప్రస్తుతం క్రిప్టోలపై నమ్మకాన్ని పెంచుతోంది.
నిపుణుల మాట ఇదే..
బిట్‌కాయిన్ తన కీలక రెసిస్టెన్స్ జోన్ లక్ష 10వేల డాలర్లను క్రాస్ చేసిన తర్వాత బులిష్ మెుమెంటం చూపిస్తోందని జియోటస్ క్రిప్టో ఎక్స్ఛేంజీ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత బిట్‌కాయిన్ ప్రయాణం సరికొత్త గ్రోత్ ఫేజ్ ప్రారంభాన్ని సూచిస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెమ్మదిగా సర్థుమణగటం తాజా పెరుగుదలకు మద్ధతిస్తున్న ఒక అంశమని సుబ్బురాజ్ అన్నారు. ప్రస్తుం మెుత్తం క్రిప్టో మార్కెట్ క్యాప్ 3.44 ట్రిలియన్ డాలర్లుగా ఉందన్న ఆయన.. రానున్న కొన్ని వారాల్లో ఇతర ఆల్ట్ కాయిన్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.