సింగరేణిపై జంగ్ సైరన్..సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆందోళనలకు సిద్ధమైన ఏఐటీయూసీ యూనియన్

సింగరేణిపై జంగ్ సైరన్..సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆందోళనలకు సిద్ధమైన ఏఐటీయూసీ యూనియన్
  • ఇయ్యాల ‘సేవ్ సింగరేణి’ పేరిట గోలేటి నుంచి కొత్తగూడెం వరకు జాతా
  • 14  రోజుల పాటు ఆందోళనలు

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధనకు సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ జంగ్​సైరన్​ మోగించేందుకు సిద్ధమవుతోంది. 14 రోజుల పాటు నిర్వహించే ఆందోళనలో భాగంగా మంగళవారం బొగ్గు గనులపై సింగరేణి యాజమాన్యం తీరును వ్యతిరేకిస్తూ నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టింది. తర్వాత సేవ్​ సింగరేణి బస్సు యాత్ర, సింగరేణి మెయిన్​ఆఫీస్​ ఎదుట ధర్నా, అనంతరం ఇతర సంఘాలను కలుపుకొని సమ్మె తదితర ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనుంది.

 ఏప్రిల్​లో సైతం మరో సమ్మె జరిగే అవకాశాలు ఉన్నాయి. -డైరెక్టర్లు ముగ్గురు మారడంతో సంస్థపై పట్టు తగ్గి, బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పడిపోయిందని యూనియన్ ఆరోపిస్తోంది. స్ర్టక్చరల్​ సమావేశంలో అంగీకరించిన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని డిమాండ్​చేస్తోంది. మెడికల్​అన్​ఫిట్​అయి శిక్షణ పూర్తి చేసుకున్న 300 మందికి పోస్టింగ్ ఇవ్వాలని కోరుతోంది. సింగరేణికి సర్కార్​లోని పలు శాఖల నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వల్ల సంస్థలో కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్​లో ఉండడం, ఉద్యోగుల జీతాలకు ప్రతీ నెల బ్యాంకు నుంచి ఓవర్​ డ్రాప్ట్​ చేయాల్సి వస్తోందని యూనియన్​ ఆరోపిస్తోంది.

నేటి నుంచి బస్సు యాత్ర..

బుధవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​ ఏరియాలోని ఆర్కే-7 గనిపై  సింగరేణి జాత పేరుతో గోలేటీ నుంచి కొత్తగూడెం వరకు ఆరు జిల్లాల గుండా బస్సు యాత్ర ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేశారు. అన్ని ఏరియాల్లోని గనుల మీదుగా పర్యటించి ఈ నెల 30న కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్​ ఆఫీస్​ ఎదుట ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. 14 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టి అంతిమంగా ఏప్రిల్​లో సమ్మె చేయాలని ఏఐటీయూసీ నిర్ణయించింది. సమ్మె సక్సెస్​కోసం యూనియన్​ శ్రేణులు గేట్​మీటింగ్​లు, పోస్టర్ల ఆవిష్కరణలతో ప్రచారం చేశారు.

యూనియన్ ​డిమాండ్లు ఇవే..

ఏసీబీ సాకుతో నిలిపివేసిన మెడికల్​బోర్డు పునరుద్ధరణ,- సింగరేణిలో రాజకీయ జోక్యం నిలిపివేయడం, డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించడం, కార్మికులకు సొంతింటి పథకం అమలు, పెర్క్స్​పై ఇన్​కమ్​ టాక్స్​ యాజమాన్యం చెల్లింపు,- రూ.51వేల కోట్ల బకాయిలు చెల్లింపు,- పెండింగ్​లో ఉన్న మారుపేర్లు సవరణ, విజిలెన్స్​ కేసుల సమస్య, -గోలేటీ, మాదారం, ఇల్లందు, మణుగూరు, భూపాలపల్లి, తాడిచెర్ల  ప్రాంతాల్లో కొత్త బొగ్గు గనుల ఏర్పాటు, -డిస్మిస్​ చేసిన కార్మికులకు మరో అవకాశం ఇవ్వడం, కాంట్రాక్ట్​ కార్మికులకు హైపవర్​ వేతనాలు, కార్మికుల సంక్షేమం, సాధారణ మరణానికి రూ.25లక్షల ఎక్స్​గ్రేషియా, సీనియర్​ మైనింగ్​ సర్దార్లకు ఓవర్​మెన్​గా ప్రమోషన్లు, అన్ని క్యాడర్​ స్కీంల సవరణ,- బొగ్గు గనుల్లో ఆధునిక రక్షణ పరికరాల ఏర్పాటు, క్లరికల్, పారామెడికల్, ఎస్​అండ్​పీసీ, పీఏఓ, ఎలక్ర్టిషియన్లు, ఫిట్టర్లు తదితర డిపార్ట్​మెంట్లలో ఖాళీలను ఇంటర్నల్​ఉద్యోగులతో భర్తీ చేయాలని డిమాండ్​చేస్తున్నారు.