
- ఇందులో ఒకరు రెండో సెట్ నామినేషన్ దాఖలు
- మిగతా వారిలో ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు
- ఇప్పటి వరకు 20 మంది అభ్యర్థుల నామినేషన్ల దాఖలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం రెండో రోజు మంగళవారం 11 మంది నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి. షేక్ పేట లోని ఆర్వో కార్యాలయంలో ఆర్వో సాయిరాం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్లు వేసిన వారిలో ఇండిపెండెంట్ అభ్యర్థి వేముల విక్రమ్ రెడ్డి మొదటి రోజు సోమవారం ఒక సెట్ నామినేషన్ వేయగా మంగళవారం మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు.
బింగి రాములు, కందడి మనిపాల్ రెడ్డి, గొంటి శ్రీకాంత్, ముల్య సంజీవులు, పనుగోటు లాలసింగ్, పబ్బతి శ్రీకృష్ణ స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. రిజిస్టర్డ్ పార్టీల నుంచి వేసిన వారిలో.. ఆల్ ఇండియా కిసాన్ జనతా పార్టీ నుంచి చంద్రశేఖర్, శ్రమజీవి పార్టీ నుంచి భాస్కర్, అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మహ్మద్ మన్సూర్ అలీ, పాట పార్టీ నుంచి వెంకట్ రెడ్డి ఉన్నారు. రెండ్రోజుల్లో మొత్తం 20 మంది అభ్యర్థుల నుంచి 22 సెట్ల నామినేషన్లు వచ్చాయి. వీరిలో రిజిస్టర్ పార్టీల నుంచి ఆరుగురు వేయగా, 14 మంది ఇండిపెండెట్ క్యాండిడేట్లుగా నామినేషన్లు వేశారు.