కరోనా ఆంక్షలు ఎత్తివేశాక.. 2  నెలల్లోనే 20 లక్షల మంది మృతి

కరోనా ఆంక్షలు ఎత్తివేశాక.. 2  నెలల్లోనే 20 లక్షల మంది మృతి
  • అమెరికా రీసెర్చ్ సంస్థ వెల్లడి

బీజింగ్: చైనాలో కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత భారీ సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు. రెండు నెలల్లోనే దాదాపు 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు మూడేండ్ల పాటు కఠిన ఆంక్షలు విధించిన తర్వాత 2022 డిసెంబర్​లో అక్కడి ప్రభుత్వం వాటిని పూర్తిగా ఎత్తివేసింది. దీంతో 2023 జనవరి నెలాఖరు నాటికి కరోనాతో 19 లక్షల మందికిపైనే మరణించినట్లు తెలిసింది. అమెరికాలోని సియాటిల్​కు చెందిన ఫెడరల్ ఫండ్​ఫ్రెడ్​ హచిసన్ క్యాన్సర్ సెంటర్ చేసిన స్టడీలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 

దహన సంస్కారాలు 70% పెరిగినయ్

కరోనా ప్రపంచమంతటా తగ్గినప్పటికీ చైనాలో మాత్రం దాని ప్రభావం చాలారోజులు కొనసాగింది. దీంతో ఆ దేశం రకరకాల ఆంక్షలు విధిస్తూ వచ్చింది. ఒక్క కేసు కూడా లేకుండా చేయాలనే ఉద్దేశంతో కఠినమైన ఆంక్షలు మూడేండ్ల పాటు కొనసాగించింది. 2022 డిసెంబర్​లో కండిషన్లన్నీ  ఎత్తివేస్తూ.. కరోనాను జయించామని ఆ దేశం ప్రకటించుకుంది. అప్పటినుంచి దేశంలో ఎంతమంది కరోనా బారిన పడుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారనే వివరాలు వెల్లడించడం నిలిపివేసింది. అయితే, ఈ ఏడాది మొదటి 3 నెలల్లో దహన సంస్కారాలు 70 శాతం పెరిగాయని చైనాలోని ఓ ప్రావిన్స్ వెబ్​సైట్ పేర్కొంది. ఇలాంటి చైనాకు చెందిన పలు వెబ్​సైట్ల ద్వారా హచిసన్ క్యాన్సర్ సెంటర్ మరణాల వివరాలను సేకరించి ప్రచురించింది.