ఇంట్లనే పెండ్లి..20 మంది చుట్టాలకే ఛాన్స్

ఇంట్లనే పెండ్లి..20 మంది చుట్టాలకే ఛాన్స్

న్యూఢిల్లీ, వెలుగు: లాక్​డౌన్​ను మరో వారం పాటు పొడిగించింది ఢిల్లీ సర్కార్​. కొంతవరకు తెగిన కరోనా మహమ్మారి గొలుసుకట్టును పూర్తిగా తెంచేసేందుకు ఈసారి లాక్​డౌన్​ను మరింత కఠినం చేసింది. తగ్గుతున్న కేసులు మళ్లీ పెరగకుండా ఉండేందుకు ‘కఠిన లాక్​డౌన్​’ను అమలు చేస్తున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్​ కేజ్రీవాల్​ ఆదివారం ప్రకటించారు. ఏప్రిల్​ 26న 35 శాతం ఉన్న పాజిటివిటీ రేటు.. ఇప్పుడు 23 శాతానికి తగ్గిందని, లాక్​డౌన్​తోనే చైన్​ కొంత వరకు తెగిందని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే కట్టడి కాడి వదిలేయకుండా ఆంక్షలను కఠినం చేస్తున్నట్టు చెప్పారు. మే 17 వరకు లాక్​డౌన్​ అమల్లో ఉంటుందన్నారు.

పెండ్లింటి ముందు టెంట్​కూ నో

కఠిన లాక్​డౌన్​లో భాగంగా ఈ సారి.. ఫంక్షన్​హాళ్లు, పబ్లిక్​ ప్లేసుల్లో పెండిండ్లను నిషేధిస్తున్నట్టు కేజ్రీవాల్​ ప్రకటించారు. కేవలం ఇండ్లు, రిజిస్ట్రార్​ ఆఫీసుల్లోనే పెండ్లిండ్లు చేసుకోవాలని తేల్చి చెప్పారు. అది కూడా కేవలం 20 మంది చుట్టాలకే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. పెండ్లింటి ముందు టెంట్​ కూడా వేసుకోవద్దని తేల్చిచెప్పారు. పెండ్లి పెట్టుకున్న వాళ్లు ఇప్పటికే కేటరింగ్​, డీజే, టెంట్​హౌస్​లకు డబ్బులు కట్టి ఉంటే.. ఆ వ్యాపారులు డబ్బును తిరిగిచ్చేయాలని, లేదంటే వేరే తేదీలో పెండ్లి పెట్టుకోవాలని స్పష్టం చేశారు. సోమవారం నుంచి మెట్రో సర్వీసులనూ పూర్తిగా బంద్​ పెడుతున్నట్టు ప్రకటించారు. 

లాక్​డౌన్​లోనే సౌలతులు పెంచుకున్నం 

ప్రాణం ఉంటెనే ప్రపంచం (జాన్​ హై తో జహాన్​ హై) ఉంటుందని కేజ్రీవాల్​ అన్నారు. గొందిలో ప్రాణాలుంటే జీవితంలో ఎన్నైనా చేయొచ్చన్నారు. లాక్​డౌన్​ టైంలోనే మెడికల్​ పరికరాలు, ఆక్సిజన్​, ఐసీయూ బెడ్ల పెంపు వంటి విషయాలపై ఫోకస్​ పెట్టామని ఆయన చెప్పారు. మూడు వారాల్లోనే ఆక్సిజన్​, ఐసీయూ బెడ్లను భారీగా పెంచుకోగలిగామన్నారు. దీంతో కరోనా కేసులతో పాటు, మరణాలనూ చాలా వరకు తగ్గించగలిగామని చెప్పారు. మూడో ఫేజ్​లో భాగంగా యువతకూ వ్యాక్సిన్లను వేస్తున్నామని, వ్యాక్సినేషన్​ వేగంగా సాగుతోందని చెప్పారు. డిమాండ్​కు తగ్గట్టు వ్యాక్సిన్లను సరఫరా చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతామన్నారు. 

ఐదోరోజూ తగ్గిన కేసులు..

లాక్​డౌన్​తో ఢిల్లీలో వరుసగా ఐదోరోజూ కరోనా కేసులు, మరణాలు భారీగా తగ్గుముఖం పట్టాయి. కొత్తగా13,336 మంది కరోనా బారిన పడగా.. 273 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు రోజుతో పోలిస్తే దాదాపు 4 వేల దాకా కేసులు తగ్గాయి. కొత్త కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 13,23,567కు పెరిగింది. 12,17,991 మంది కోలుకున్నారు. ఇంకా 86,232 మంది ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు. శనివారం ఒక్కరోజే 1.29 లక్షల మందికిపైగా వ్యాక్సిన్​ వేశారు. 

యూపీలోనూ లాక్​డౌన్​ పొడిగింపు

ఢిల్లీతో పాటు ఉత్తర​ప్రదేశ్​లోనూ లాక్​డౌన్​ను పొడిగించారు. సోమవారంతో ముగియనున్న లాక్​డౌన్​ను మే 17 వరకు పొడిగిస్తూ యూపీ సర్కార్​ ఉత్తర్వులు ఇచ్చింది. కరోనా కర్ఫ్యూతో మంచి ఫలితాలు వస్తున్నాయని ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, కోచింగ్​ సెంటర్లకు మే 20 దాకా సెలవులను ప్రకటించాలని ఆదేశాలిచ్చింది. ఆన్​లైన్​ క్లాసులనూ బంద్​ పెట్టాల్సిందేనని తెలిపింది.  భోపాల్​లోనూ మే 17 వరకు లాక్​డౌన్​ను పొడిగించారు.