గుజరాత్‌‌లో పిడుగు పడి 20 మంది మృతి

గుజరాత్‌‌లో పిడుగు పడి 20 మంది మృతి

అహ్మదాబాద్‌‌: గుజరాత్‌‌లో పిడుగు పడి 20 మంది మృతి చెందారు. ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమైందని, దీంతో పిడుగులు పడి ప్రజలు చనిపోయారని స్టేట్‌‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌‌ సెంటర్‌‌‌‌ (ఎస్‌‌ఈవోసీ) అధికారులు సోమవారం తెలిపారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 252 తాలుకాలు ఉంటే, 234 తాలుకాల్లో అకాల వర్షాలు, పిడుగులు పడ్డాయని వెల్లడించారు. 

సూరత్‌‌, సురేంద్ర నగర్​, ఖేడా, తాపీ, భరూచ్‌‌, అమ్రేలి జిల్లాల్లో 50 నుంచి 117 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయిందని తెలిపారు. అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టం భారీగా జరిగిందన్నారు. సౌరాష్ట్ర ప్రాంతంలోని మోర్బి జిల్లాలో సిరామిక్‌‌ పరిశ్రమను మూసివేశారన్నారు. అలాగే, రాష్ట్రంలో సోమవారం వర్షాలు కొంతమేర తగ్గుముఖం పట్టాయని ఐఎండీ తెలిపింది. 

పిడుగు పాటు ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్‌‌ షా దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ‘‘గుజరాత్‌‌లో అకాల వర్షాలు, పిడుగులు పడి 20 మంది మరణించారనే వార్తతో నేను చాలా బాధపడ్డాను. మృతుల కుటుంబాలకు నా సంతాపం. తమ వారిని కోల్పోయి బాధలోఉన్న కుటుంబాలకు ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి”అని ట్విట్టర్‌‌‌‌లో పేర్కొన్నారు.