
హైదరాబాద్, వెలుగు: కరోనా వ్యాప్తి గురించి తెలుసుకునేందుకు ప్రతి జిల్లాలో వారానికి కనీసం 200 మందికి టెస్టులు చేయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం చేస్తున్న టెస్టులతో సంబంధం లేకుండా, ఈ టెస్టులు చేయించాలని అన్ని రాష్ట్రాలకు సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ సోమవారం ఆదేశించింది. ప్రతి జిల్లాలో ఆరు ప్రభుత్వ, నాలుగు ప్రైవేటు హాస్పిటల్స్‌ను ఎంపిక చేయాలని, ఆయా దవాఖాన్లకు వస్తున్న 50 మంది ఔట్ పేషెంట్లు, 50 మంది గర్భిణుల శాంపిల్స్ సేకరించాలని సూచించింది. వీళ్లలో ఎవరికీ వైరస్ లక్షణాలు ఉండకూడదని స్పష్టం చేసింది. ఆయా జిల్లాల్లో ప్రతి వారం వంద మంది హెల్త్ కేర్ వర్కర్స్‌కు టెస్టులు చేయించాలని ఆదేశించింది. మొత్తంగా వారానికి కనీసం రెండొందలు, నెలకు 800 మందికి ర్యాండమ్‌గా టెస్టులు చేయాలని సూచించింది. ఆర్టీపీసీఆర్‌తోపాటు ఎలిసా ఐజీజీ టెస్ట్ కూడా చేయాలని చెప్పింది. ఇది వరకే వైరస్ వచ్చి, నయమైనా ఎలిసా ఐజీజీ టెస్టులో తెలిసిపోతుంది. వైరస్ వచ్చినవాళ్ల రక్తంలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. వీటిని ఎలిసా ఐజీజీతో గుర్తించొచ్చు.
హోం క్వారంటైన్ ముగిస్తే టెస్టులు వద్దు
కరోనా పేషెంట్లకు 17 రోజులు ఎటువంటి సింప్టమ్స్ లేకపోయినా, శాంపిల్స్ సేకరించి 17 రోజులు పూర్తయినా, పది రోజుల పాటు ఎటువంటి ఫీవర్ లేకపోయినా అలాంటి వారి హోం క్వారంటైన్ పూర్తయినట్లేనని సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. మోడరేట్, ప్రీ సింప్టమాటిక్, మైల్డ్, వెరీ మైల్డ్ కేసుల్లో సింప్టమ్స్ తగ్గిపోయిన తర్వాత డిశ్చార్జ్‌కు ముందు టెస్టులు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు వెరీ మైల్డ్, ప్రీ సింప్టమాటిక్ కేసుల హోం క్వారంటైన్‌కు సంబంధించి సవరించిన గైడ్‌లైన్స్‌ను సోమవారం విడుదల చేసింది. ప్రీ సింప్టమాటిక్, వెరీ మైల్డ్ సింప్టమ్స్ ఉన్న వారు ఇంట్లో సెల్ఫ్ క్వారంటైన్ సదుపాయం ఉన్నట్లయితే హోం క్వారంటైన్‌లో ఉండాలని, మిగతా ఫ్యామిలీ మెంబర్లతో కాంటాక్ట్ లేకుండా చూసుకోవాలని సూచించింది. ఇలాంటి వారి విషయంలో పేషెంట్‌ను మెడికల్ ఆఫీసర్ ప్రీ సింప్టమటిక్ కేసు లేదా వెరీ మైల్డ్ కేసుగా ప్రకటించాల్సి ఉంటుందని చెప్పింది. అతని ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు జిల్లా సర్వయిలెన్స్ ఆఫీసర్‌కు తెలియజేయాలని పేర్కొంది. ‘‘హోం క్వారంటైన్‌లో ఉన్న పేషెంట్లకు 17 రోజుల పాటు ఎలాంటి సింప్టమ్స్ లేకపోతే(లేదా ప్రీసింప్టమాటిక్ కేసుల్లో శాంపిల్స్ సేకరించిన రోజు నుంచి) పది రోజుల పాటు ఎలాంటి ఫీవర్ లేనట్లయితే హోం ఐసోలేషన్ ముగిసినట్టుగా భావించాలి. హోం క్వారంటైన్ ముగిసిన తర్వాత వారికి టెస్టులు చేయాల్సిన అవసరం లేదు”అని గైడ్‌లైన్స్‌లో స్పష్టం చేసింది.