20 వేల క్వింటాళ్ల బడి బియ్యం ముక్కిపోయినయ్!

20 వేల క్వింటాళ్ల బడి బియ్యం ముక్కిపోయినయ్!

9 నెలలుగా స్కూళ్లలోనే మిడ్​ డే మీల్స్ బియ్యం

రాష్ట్రంలోని సర్కారు బడులు ఈ ఏడాది తెరుచుకోకపోవడంతో పిల్లలకు పెట్టాల్సిన మిడ్ డే మిల్స్ బియ్యం ముక్కిపోయాయి. పురుగు పట్టి, గడ్డలుకట్టి రంగు మారినయ్. ఏకంగా 20వేల క్వింటాళ్ల బియ్యం ఇట్ల ఖరాబ్ అయినయ్. కానీ అధికారులు మాత్రం కొన్ని బియ్యమే కరాబ్ అయ్యాయని చెప్తున్నరు. 9 నెలలుగా బడుల్లోని బియ్యాన్ని వెనక్కి తీసుకోవాలని హెడ్మాస్టర్లు, టీచర్లు కోరుతున్నా, విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదు. దీంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని హెడ్మాస్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని సర్కారు, ఎయిడెడ్ స్కూళ్లలో మిడ్​డే మీల్స్​స్కీమ్ కొనసాగుతోంది. దీనిపరిధిలో సుమారు 22,73,043 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వీరిలో ఒకటో తరగతి నుంచి 8 వ తరగతి వరకు 17.95 లక్షల మంది ఉండగా, 9,10 తరగతుల స్టూడెంట్స్ 4.77లక్షల మంది ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఆయా స్టూడెంట్స్​కు ప్రతినెలా అవసరమైన 40వేల క్వింటాళ్ల బియ్యం ఎల్ఎంఎస్​ పాయింట్ల నుంచి హెడ్మాస్టర్లు స్కూళ్లకు తీసుకుపోతుంటారు. కరోనా లాక్​డౌన్​తో మార్చి16 నుంచి స్కూళ్లు మూతపడ్డాయి. దీంతో ఆయా బడుల్లో ఉన్న బియ్యం నిల్వలు అట్లనే ఉండిపోయాయి.

బియ్యం ముక్కిపోయినయ్…

మార్చి నెలలో కరోనా లాక్ డౌన్ పెట్టడం, అప్పటి నుంచి బడులు తెరవకపోవడంతో 20వేల క్వింటాళ్ల స్కూళ్లలోనే ఉండిపోయాయి. అప్పట్లో ఎవ్వరూ బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో, ఎలాంటి జాగ్రత్తలు లేకుండానే బడుల్లో బియ్యం ఉన్నాయి. దీంతో బియ్యం పురుగులు పట్టిపాడవడం మొదలైంది. మే 1 ‘పిల్లల బియ్యం పురుగుల పాలు’ శీర్షికతో ‘వెలుగు’ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. దీంతో విద్యాశాఖ అధికారులు స్పందించి, హెడ్మాస్టర్ల ద్వారా బియ్యం వివరాలను సేకరించి కాస్త హడావుడి చేశారు. కానీ బడుల్లో కొన్ని బియ్యమే పాడయ్యాయనీ, మిగిలిన బియ్యాన్ని జాగ్రత్తగా దాచాలని సూచనలు చేసి వదిలేశారు. ఆ తర్వాత రెండు సార్లూ బియ్యం వివరాలను సేకరించారు. కానీ చాలామంది హెడ్మాస్టర్లు భయంతో సరైన రిపోర్టు ఇవ్వలేదు. ఒకవేళ బియ్యం పాడైనయ్ అనే రిపోర్ట్ ఇస్తే, తమపై ఎక్కడ చర్యలు తీసుకుంటారోననే టెన్షన్ వారిలో ఉంది. అక్టోబర్ లో కురిసిన భారీవర్షాలతో బడుల్లోని బియ్యం నాని దాదాపు పాడయ్యాయి. కొన్ని బడుల్లో ఎలుకలు, పందికొక్కులు బియ్యాన్ని నాశనం చేస్తే, కొన్నింటిలో ముక్కపట్టి, పురుగులు పట్టి కరాబ్ అయ్యాయి. మరికొన్ని స్కూళ్లలో బియ్యం కలర్ మారిపోయి, వాసన వస్తున్నది. అధికారుల సూచనలతో పలు బడుల్లో కొందరు హెడ్మాస్టర్లు కొన్ని బియ్యం వండిస్తే, ఆ అన్నం తినేందుకు పనికి రాదని స్పష్టమైంది. అయితే ఈ విషయాలను అధికారులు దాస్తున్నారు. పలు జిల్లాల్లో బియ్యం పాడైనా, మంచిగానే ఉన్నాయనే రిపోర్టు ఇవ్వాలని హెడ్మాస్టర్లపై కొందరు ఆఫీసర్లు ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలిసింది.

ఆఫీసర్ల నిర్లక్ష్యం…

 

9 నెలల నుంచి మిడ్​ డే మిల్స్ బియ్యం బడుల్లోనే ముక్కిపోతున్నయని, మే నెలలోనే చాలామంది హెడ్మాస్టర్లు, టీచర్ల యూనియన్ నేతలు ఈ బియ్యాన్ని వెనక్కి తీసుకుని, బడులు చాల్ అయినంక ఇవ్వాలని అధికారులను కోరారు. కానీ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు వారి మాట పక్కన పెట్టారు. బియ్యం పాడవుతున్నాయనే విషయాన్ని ఉన్నతాధికారులకు, సర్కారు పెద్దలకు తెలుపకుండా, తప్పుడు రిపోర్టులు వారికి ఇచ్చారనే వాదనలూ ఉన్నాయి. అయితే ఇప్పటికీ ఏ ఒక్క ఉన్నతాధికారి ఫీల్డ్​లో బియ్యాన్ని పరిశీలించకపోవడం గమనార్హం. అధికారుల నిర్లక్ష్యంతో దాదాపు 20వేల క్వింటాళ్ల బియ్యం తిండికి పనికి రాకుండా పోయాయి. అయితే బడులు ప్రారంభమయ్యాక, ఈ బియ్యానే పిల్లలకు వండిస్తారనే భయాందోళనలో టీచర్లు, హెడ్మాస్టర్లు ఉన్నారు.  సర్కారు పెద్దలు స్పందించి, బియ్యాన్ని వెనక్కి తీసుకోవాలని వారు కోరుతున్నారు.