ఇస్లామాబాద్: టీ20 వరల్డ్ కప్ 2026లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ విజయవంతంగా ముగిసింది. 2026, ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ హై ఓల్టేజ్ మ్యాచులో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన భారత్ 61 పరుగుల తేడాతో దాయాది దేశాన్ని చిత్తుచేసింది. అయితే.. ఈ మ్యాచుకు ముందు ఎన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయో అందరికీ తెలిసిందే. వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్‌ను ఐసీసీ భర్తరఫ్ చేయడం.. బంగ్లాకు మద్దతుగా ఇండియా మ్యాచును బాయ్ కాట్ చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించడం.. దీంతో ఇండియా, పాక్ మ్యాచ్ జరుగుతుందా లేదా అని అభిమానుల్లో టెన్షన్.
ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఐసీసీ పాకిస్తాన్‌తో చర్చలు జరిపి ఎట్టకేలకు ఇండియా, పాక్ మ్యాచ్ యధావిధిగా జరిగేలా చూసింది. బాయ్ కాట్ విషయంలో పాక్ యూటర్న్ తీసుకుని ఈ మ్యాచ్ సక్సెస్ ఫుల్‌గా జరగడంలో ఐసీసీ చైర్మన్ జై షా కీ రోల్ ప్లే చేసినట్లు ఊహాగానాలు వినిపించాయి. కానీ చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జరిగేలా చక్రం తిప్పింది ఐసీసీ, ఐసీసీ చైర్మన్ జై షా కాదంట. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్నాయకే ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ జరగడం చక్రం తిప్పిన అసలైన హీరో అంట. ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ వెల్లడించాడు.
శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్నాయకే సకాలంలో జోక్యం చేసుకుని టీ20 వరల్డ్ కప్‌లో భారత్, పాక్ మ్యాచ్ జరిగేలా కృషి చేశారని నఖ్వీ పేర్కొన్నారు. ఇండియా, పాక్ మ్యాచ్ విజయవంతంగా జరగడంలో కృషి చేసినందుకు దిస్నాయకేకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నాడు. దిస్నాయకే తమ రాష్ట్రపతి, ప్రధానికి ఫోన్ చేసి ఇండియా, పాక్ మ్యాచ్ నిర్వహణకు ఒప్పించారని తెలిపారు. దిస్నాయకే కాల్ చేసిన వెంటనే ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు ప్రభుత్వం తమకు అనుమతి ఇచ్చిందని నఖ్వీ వెల్లడించారు. సకాలంలో జోక్యం చేసుకుని 2 బిలియన్ల మంది ప్రజలకు వినోదం అందించిన అసలైన హీరో దిస్నాయకే అని నఖ్వీ కొనియాడారు.
భద్రతా పరమైన కారణాలతో టీ20 వరల్డ్ కప్‌లో ఇండియాలో పర్యటించేందుకు బంగ్లాదేశ్ నిరాకరించింది. తమ మ్యాచులను ఇండియా బయట నిర్వహించాలని బంగ్లా ఐసీసీని కోరింది. కానీ ముందుగానే షెడ్యూల్ ఖరారు కావడంతో బంగ్లా అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను భర్తరఫ్ చేసి స్కాట్లాండ్కు అవకాశం ఇచ్చింది.
బంగ్లాదేశ్‌ను భర్తరఫ్ చేయడంతో ఆ జట్టుకు మద్దతుగా టీ20 వరల్డ్ కప్‌లో ఇండియాతో మ్యాచ్‌ను బాయ్ కాట్ చేయాలని పాక్ నిర్ణయించుకుంది. ఇండియా, పాక్ మ్యాచ్ రద్దు అయితే భారీగా ఆర్థిక నష్టం వచ్చే అవకాశం ఉండటంతో ఐసీసీ రంగంలోకి దిగి చర్చలు జరిపింది. 2026 టీ20 వరల్డ్ కప్‌కు ఇండియాతో పాటు అతిథ్యమిస్తోన్న శ్రీలంక కూడా పాకిస్తాన్‌తో సంప్రదింపులు జరిపింది.
శ్రీలంకలోని కొలంబోలో జరగనున్న ఇండియా, పాక్ మ్యాచ్ రద్దు అయితే తమకు తీవ్రమైన ఆర్ధిక నష్టం వాటిళ్లుతోందని.. ఈ మేరకు శ్రీలంక ప్రెసిడెంట్ దిస్నాయకే పాక్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఐసీసీ, శ్రీలంక బోర్డు చర్చలతో దిగొచ్చిన పాక్ బాయ్ కాట్ విషయంలో యూటర్న్ తీసుకుని ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు అంగీకరించింది.
