గోద్రా రైలు దహనం కేసు... దోషుల బెయిల్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

గోద్రా రైలు దహనం కేసు... దోషుల బెయిల్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

58 మంది మృతికి కారణమైన 2002 గోద్రా రైలు దహనం కేసులో ముగ్గురు దోషుల బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఉరిశిక్ష అనుభవిస్తున్న ఎనిమిది మంది దోషులు ఇప్పటికే 17 ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపిన క్రమంలో చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.

ఫిబ్రవరి 27, 2002న గోద్రా రైల్వే స్టేషన్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్ కోచ్‌ను తగులబెట్టినప్పుడు గుజరాత్ లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనలో స్థానిక కోర్టు 2011లో 31 మంది నిందితులను దోషులుగా నిర్ధారించి 63 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. గుజరాత్ ప్రభుత్వం తరపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. ముగ్గురిపై ఆరోపణలు కేవలం రాళ్లదాడి మాత్రమే కాదని, బాధితులు కాలిపోతున్న కోచ్ నుంచి తప్పించుకోకుండా నిరోధించారని అన్నారు.

"S-6 కోచ్‌ను దుండగులు తగులబెట్టిన తర్వాత, తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయాణికులు కోచ్ నుంచి బయటకు రాకుండా, బయటి నుంచి ఎవరూ వారిని రక్షించడానికి వెళ్ళకుండా చూసేందుకు దోషులు కోచ్‌పై రాళ్ల వర్షం కురిపించారు. కాలిపోతున్న కోచ్‌పై కిరోసిన్, పెట్రోల్ పోశారు" అని తుషార్ మెహతా చెప్పారు.