2016 మేనిఫెస్టోను మక్కీకి మక్కి దించారు

2016 మేనిఫెస్టోను మక్కీకి మక్కి దించారు
  • అన్నీ పాతయే టీఆర్​ఎస్  మేనిఫెస్టోపై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి
  • లక్ష డబుల్​ బెడ్రూం ఇండ్లుకట్టియ్యకపోతే ఓట్లడగనంటివి కదా?
  • ఇన్నేండ్లలో ఎన్ని ఇండ్లు కట్టిచ్చినవ్​?
  • ఓల్డ్​ సిటీకి మెట్రో ఆపిందెవరు?
  • ఒక్క రేషన్​కార్డన్నా ఇచ్చినవా?
  • దేశానికి నీ దశ దిశ అక్కర్లేదు
  • సంపద సృష్టించడమంటే.. వరద సాయం మింగడమా..?
  • సీఎం కేసీఆర్​పై కిషన్​రెడ్డి ఫైర్​

హైదరాబాద్, వెలుగు: టీఆర్​ఎస్​ విడుదల చేసిన మేనిఫెస్టోతో ప్రజలకు జరిగే మేలు ఏమీ ఉండదని, 2016 నాటి మేనిఫెస్టోను మక్కీకి మక్కి దించారని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి విమర్శించారు. దేశానికి దిశా నిర్దేశం చేస్తానన్న సీఎం కేసీఆర్​ కామెంట్స్​పై మండిపడ్డారు. ‘‘ముందు తెలంగాణకు ఇప్పటి వరకు నువ్వు చూపించిన దశ, దిశ ఏమిటో చెప్పు. నీ కుటుంబానికి దశ, దిశ చూపిస్తే సరిపోతుందా?” అని ప్రశ్నించారు. దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ప్రధాని మోడీకి తెలుసని, కేసీఆర్​ సలహాలు ఏమీ అక్కర్లేదన్నారు.

‘‘మతతత్త్వ శక్తులకు, విచ్ఛిన్నకర శక్తులకు అవకాశం ఇవ్వొద్దని కేసీఆర్ అంటున్నరు. ఎవరు.. ఎవరిని ప్రోత్సహిస్తున్నరో ప్రజలే గమనిస్తున్నరు” అని చెప్పారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో ఓ నీటి బుడగ వంటిదని ఆయన విమర్శించారు. ఆ మేనిఫెస్టోతో ప్రజలకు ఒరిగేది ఏమీలేదన్నారు.  ప్రింట్ చేసిన పేపర్ మాత్రమే కొత్తదని, అందులోని మ్యాటర్  పాతదేనని ఎద్దేవా చేశారు. ఈ మేనిఫెస్టోలో మాటలకు, చేతలకు పొంతన లేదన్నారు. అధికార పార్టీ మేనిఫెస్టో అంటే ఏదో కొత్త విషయం ఉంటుందనుకున్నామని, కాని అందులో ఏమీ లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏమాత్రం నైతికత లేదని, మాట మీద నిలబడే వ్యక్తి కాదని, విశ్వసనీయత అనేది అసలే ఆయనకు లేదని మండిపడ్డారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

సంపద సృష్టించడమంటే ఏంది?

సంపద సృష్టించే సర్కార్ రావాలని కేసీఆర్ అంటున్నారని, వరద బాధితులకు ఇవ్వాల్సిన 10 వేల రూపాయల్లో సగం డబ్బులు టీఆర్​ఎస్​ కార్యకర్తలు మింగడం సంపద సృష్టించినట్లా అని కిషన్​రెడ్డి ప్రశ్నించారు. ‘‘కేసీఆర్ విడుదల చేసిన  మేనిఫెస్టో చూస్తే ప్రజలకు జ్ఞాపకశక్తి లేదని ఆయన అనుకుంటున్నట్లు అర్థమవుతున్నది. 2016 మేనిఫెస్టోలోని హామీలు అమలు చేయని కేసీఆర్.. ఈ మేనిఫెస్టోలో కూడా మళ్లీ అవే రాశారు. అప్పటి, ఇప్పటి మేనిఫెస్టోపై సీఎంది అదే ఫొటో, అదే మ్యాటర్​, అదే ఫాంట్, అవే పదాలు ఉన్నాయి. అందులో కొత్తగా ఏమీ లేదు” అని ఆయన విమర్శించారు. హైదరాబాద్​లో లక్ష డబుల్​ బెడ్రూం ఇండ్లు కట్టకుంటే ఓట్లే అడుగనని 2017లో అసెంబ్లీ సమావేశాల్లోనే సీఎం కేసీఆర్ ప్రకటించారని, మరి ఇప్పుడు ఓట్లు అడిగే నైతికత కేసీఆర్ కు ఎక్కడిదని కిషన్​రెడ్డి నిలదీశారు. ఎన్ని ఇండ్లు కట్టించారో చెప్పాలని డిమాండ్ చేశారు. అరిగిపోయిన రికార్డు టీఆర్ఎస్ మేనిఫెస్టో అని దుయ్యబట్టారు. హైదరాబాద్ ను విశ్వ నగరం చేస్తామని చెప్పి విషాద నగరంగా మార్చారని కిషన్​రెడ్డి మండిపడ్డారు.

పాత మేనిఫెస్టోనే మళ్లీ చదివిన్రు

ఆరున్నరేండ్లలో పేదలకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని టీఆర్ఎస్ సర్కార్.. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని ఇస్తామని చెబుతోందని కిషన్​రెడ్డి మండిపడ్డారు. సెలూన్లకు, దోబీ ఘాట్ లకు, పరిశ్రమలకు కరెంట్ బిల్లుల మాఫీ అంశం పాతదేనన్నారు. మేనిఫెస్టో తయారీకి సమయం లేక పాతదే చదివినట్లు ఉందని ఎద్దేవా చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు తెరిపించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను టీఆర్ఎస్ ఆరేండ్లుగా మోసం చేస్తూ వస్తున్నందునే  ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయని, కానీ చేతలు మాత్రం ఫామ్ హౌజ్ దాటవని విమర్శించారు. గ్రేటర్ నడిబొడ్డున ఉన్న రోడ్లను ప్రైవేట్ వారికి ఎందుకిచ్చారో సమాధానం చెప్పాలని  డిమాండ్ చేశారు. రైల్వే, బీఎస్ఎన్ఎల్ సంస్థలను కేంద్రం ప్రైవేట్ పరం చేయలేదని, వాటిని ఆదుకునేందుకు నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తామని కేసీఆర్ అన్నారని, ఏమైందని ప్రశ్నించారు.

ఓల్డ్​ సిటీకి మెట్రోను ఆపిందెవరు?

మెట్రో రైలు పాత బస్తీకి వెళ్లకుండా ఆగిపోవడానికి టీఆర్ఎస్  కారణం కాదా? అని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ప్రశ్నించారు. ఓల్డ్ సిటీకి మెట్రో తీసుకెళ్లని టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు అక్కడి ఓటర్లపై మొసలి కన్నీరు కార్చడమేమిటని నిలదీశారు. ఈ రెండు పార్టీలకు అక్కడి జనం ఓట్లెందుకు వేయాలన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం ముందుకు వచ్చిన విషయం సీఎం చెపితే బాగుండేదని పేర్కొన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశకు రాష్ట్ర సర్కార్ తన వాటా ఇవ్వనందుకే ఆగిపోయిందని ఆయన చెప్పారు.