పుల్వామా తరహా దాడికి ప్లాన్‌.. తిప్పికొట్టిన సెక్యూరిటీ

పుల్వామా తరహా దాడికి ప్లాన్‌.. తిప్పికొట్టిన సెక్యూరిటీ
  • 20 కేజీల ఐఈడీ ఉన్న కారు సీజ్‌
  • తప్పించుకున్న డ్రైవర్‌‌

శ్రీనగర్‌‌: పుల్వామా జిల్లాలో భారీ టెర్రర్‌‌ ఎటాక్‌ను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. గురువారం తెల్లవారుజామున 20 కేజీల ఐఈడీతో ఉన్న వెహికిల్‌ను సీజ్‌ చేశారు. పుల్వామాలో సీఆర్‌‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై జరిగిన దాడి తరహాలో టెర్రరిస్టులు దీన్ని ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. డ్రైవర్‌‌ పరారీలో ఉన్నాడు. ఫేక్‌ రిజిస్ట్రేషన్‌తో వెళ్తున్న వెహికిల్‌ను చెక్‌పాయింట్‌ దగ్గర ఆపబోయారు. కానీ డ్రైవర్‌‌ వాహనాన్ని ఆపకుండా బారికేడ్లను ఢీకొట్టుకుంటూ ముందుకు వెళ్లిపోయాడని పోలీసులు చెప్పారు. దీంతో వెహికిల్‌ను వెంబడించిన సెక్యూరిటీ సిబ్బంది కాల్పులు జరిపారని, డ్రైవర్‌‌ పారిపోయాడని ఐజీ విజయ్‌కుమార్‌‌ చెప్పారు. “ మాకు దీనిపై ముందే సమాచారం వచ్చింది. అందుకే బుధవారం నుంచి తనిఖీలు చేశాం” అని ఆయన అన్నారు. బాంబ్‌ స్వ్కాడ్‌ టీమ్‌ ఐఈడీని, కారును ధ్వంసం చేసిందని, దాని కారణంగా దగ్గర్లోని కొన్ని ఇళ్లు డ్యామేజ్‌ అయ్యాయని అధికారులు చెప్పారు. ఆర్మీ, పోలీస్‌, పారమిలటరీ ఫోర్స్‌ జాయింట్‌ ఆపరేషన్‌లో పట్టుకోగలిగామని అన్నారు. డ్రైవర్‌‌ కోసం సెక్యూరిటీ సిబ్బంది గాలిస్తుందని అన్నారు.

మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ రియాజ్‌ నైకూను పుల్వామా ఎన్‌కౌంటర్‌‌ నేపథ్యంలో దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజన్స్‌ వర్గాలు హెచ్చరించాయి. కాగా.. ప్రపంచమంతా కరోనా వైరస్‌తో పోరాడుతున్నా పాకిస్తాన్‌ మాత్రం టెర్రర్‌‌ ఎటాక్స్‌కు ప్లాన్‌ చేసిందని, ఈ మేరకు హై ట్రైన్డ్‌ టెర్రరిస్టులను దాడులు చేసేందుకు దించిందని తెలుస్తోంది. ఈ రెండు నెలల వ్యవధిలో జరిగిన టెర్రర్‌‌ ఎటాక్స్‌లో 30 మంది సెక్యూరిటీ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. 38 మంది టెర్రరిస్టులను మన సైనికులు మట్టుబెట్టారు. 2019 ఫిబ్రవరి 14న సీఆర్‌‌పీఎఫ్‌ జావన్ల కాన్వాయ్‌పై జైషే మహ్మద్‌ టెర్రరిస్టు గ్రూప్‌ జరిపిన బాంబు దాడిలో40 మంది జవాన్లు అమరులయ్యారు.