తెలంగాణ ఎన్నికలు వాయిదా పడొచ్చు.. అక్టోబర్ లో నోటిఫికేషన్ డౌటే : కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ఎన్నికలు వాయిదా పడొచ్చు.. అక్టోబర్ లో నోటిఫికేషన్ డౌటే : కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి..ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అని ఎదురు చూస్తున్న క్రమంలో..మంత్రి కేటీఆర్ తెలంగాణ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్నికల నిర్వహణ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలపై ఆధారపడి ఉందన్నారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల తర్వాతే తెలంగాణలో నవంబర్ లేదా డిసెంబర్ లో ఎన్నికలు జరుగుతాయా లేదా అనే క్లారిటీ వస్తుందని చెప్పారు.

తెలంగాణ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం  జరగాలంటే  అక్టోబర్ 10 లోపు నోటిఫికేషన్  రావాలని మంత్రి కేటీఆర్ అన్నారు.  అక్టోబర్ 10 లోపు నోటిఫికేషన్  వస్తేనే తెలంగాణ ఎన్నికలు జరుగుతాయన్నారు. లేదంటే కష్టమే అని వ్యాఖ్యానించారు. ఏప్రిల్ లేదా మే నెలలో తెలంగాణ ఎన్నికలు జరగొచ్చని చెప్పారు.  అయితే ప్రత్యేక  పార్లమెంట్ సెషన్స్ అయిపోతేనే తెలంగాణ ఎన్నికలపై  క్లారిటీ వస్తుందన్నారు మంత్రి కేటీఆర్. ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణపై ప్రధాని మోదీ బయపడుతున్నాడని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతే..ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడుతుందని అనుకుంటున్నారని విమర్శించారు. అందుకే 5 రాష్ట్రాల ఎన్నికలను నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అయితే మధ్యప్రదేశ్ లో ఒక్క దగ్గరే బీజేపీ కి అవకాశం ఉందన్నారు. మిగతా రాష్ట్రాల్లో బీజేపీ గెలవడం కష్టమే అని వ్యాఖ్యానించారు. 

 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే బీఆర్ఎస్ కే ప్లస్ అని మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రజలు బీఆరేస్ వైపే ఉన్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలోనూ  పోటీ చేస్తుందని మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఉద్యమంలో పాల్గొనని రేవంత్ రెడ్డి,  కిషన్ రెడ్డిలను ప్రజలు నమ్మరని తెలిపారు. వీళ్లిద్దరి వెనుక సీమాంధ్రులు ఉన్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు సెట్ అవుతారని ధీమా వ్యక్తం చేశారు. మోదీని తాము తిట్టినంతగా ఎవరు తిట్టలేదన్నారు. తాము పోరాడినంతగా ఎవరు పోరాడలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేంత సీన్ లేదన్నారు మంత్రి కేటీఆర్.