V6 News

హోర్ముజ్ జలసంధిలో కొత్త సంక్షోభం.. 21 షిప్స్ వెనక్కి పంపేసిన అమెరికా నేవీ

హోర్ముజ్ జలసంధిలో కొత్త సంక్షోభం.. 21 షిప్స్ వెనక్కి పంపేసిన అమెరికా నేవీ

అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌ను శాసించే హోర్ముజ్ జలసంధి కేంద్రంగా అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు మరోసారి ముదురుతున్నాయి. కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత ఈ మార్గం తెరుచుకుంటుందని ప్రపంచం ఆశించినప్పటికీ.. డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న 'బ్లాకేడ్' వ్యూహం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇరాన్ రేవులకు వెళ్లే.. అక్కడి నుంచి వచ్చే నౌకలను అమెరికన్ నేవీ అడ్డుకోవడంతో దాదాపు 21 నౌకలు వెనక్కి తిరగాల్సి వచ్చింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగేర్ గాలిబాఫ్, అమెరికా తన దిగ్బంధనాన్ని కొనసాగిస్తే హోర్ముజ్ జలసంధిని పూర్తిగా క్లోజ్ చేస్తామని హెచ్చరించారు.

ఇరాన్‌తో పూర్తిస్థాయి డీల్ కుదిరే వరకు అమెరికా నౌకా దళ దిగ్బంధనం కొనసాగుతుందని ప్రకటించడం కొత్త చిచ్చుకు కారణం అయ్యింది. దీనిపై స్పందించిన ఇరాన్ విదేశాంగ శాఖ.. అమెరికా చేస్తున్న పనులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని మండిపడింది. హోర్ముజ్ గుండా ప్రయాణించే ఫిప్స్ కేవలం ఇరాన్ నిర్దేశించిన మార్గంలో.. తమ అనుమతితోనే వెళ్లాలని, ఈ విషయంలో సోషల్ మీడియా పోస్టుల కంటే క్షేత్రస్థాయి నిర్ణయాలే కీలకమని గాలిబాఫ్ స్పష్టం చేశారు. ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తే ప్రపంచ దేశాలకు అందే క్రూడ్ ఆయిల్ సప్లై నిలిచిపోయి, ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం.

ఈ యుద్ధం కేవలం ఇరు దేశాల మధ్యే కాకుండా.. గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీపై పెను ప్రభావం చూపుతోంది. అమెరికా పట్టుదల, ఇరాన్ ప్రతిఘటనల మధ్య క్రూడ్ ఆయిల్ షిప్స్ నడిసముద్రంలో చిక్కుకుపోయాయి. ఈ ప్రతిష్టంభన త్వరగా తొలగకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడే అవకాశం ఉంది. వాషింగ్టన్.. టెహ్రాన్ మధ్య సాగుతున్న ఈ మైండ్ గేమ్‌లో హోర్ముజ్ జలసంధి ఇప్పుడు ఒక గ్లోబల్ హాట్ స్పాట్‌గా మారి ఇండియా లాంటి దేశాలను ముప్పుతిప్పలు పెడుతోంది ఎనర్జీ సంక్షోభంతో.