మెగా డీఎస్సీకి 2.21 లక్షల అప్లికేషన్లు

మెగా డీఎస్సీకి 2.21 లక్షల అప్లికేషన్లు
  •     కొత్తగా 43 వేల మంది దరఖాస్తు 
  •     జూన్ 20 వరకూ గడువు

హైదరాబాద్, వెలుగు: మెగా డీఎస్సీకి దరఖాస్తుల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇప్పటి వరకూ కొత్తగా 43 వేల మంది అప్లై చేసుకోగా.. ఓవరాల్ గా 2.21 లక్షలకుపైగా అప్లికేషన్లు వచ్చాయి. జులైలో జరిగే డీఎస్సీ పరీక్షల పూర్తి స్థాయి షెడ్యూల్​ను త్వరలోనే రిలీజ్  చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 11,062 టీచర్  పోస్టుల భర్తీకి మార్చి 4 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 20 వరకూ అప్లై చేసేందుకు అవకాశం కల్పించారు. 

2023లో రిలీజ్  చేసిన డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వాళ్లు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యా శాఖ ప్రకటించింది. ఈ క్రమంలో కొత్తగా గురువారం నాటికి 46 వేల మంది ఫీజు చెల్లించగా.. 43,882 మంది అప్లై చేసుకున్నారు. గతంలో 1,77,523 మంది అప్లై చేశారు. దీంతో ఇప్పటి వరకూ 2,21,405 మంది దరఖాస్తు చేసినట్లయింది. 

త్వరలోనే డీఎస్సీ షెడ్యూల్ 

విద్యాశాఖ త్వరలోనే డీఎస్సీ ఆన్​లైన్  ఎగ్జామ్ షెడ్యూల్ ను రిలీజ్  చేయనుంది. ఇందుకు ఆ దిశగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే జులై 17 నుంచి 31 వరకూ డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.