
గద్వాల, వెలుగు: జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. శనివారం ప్రాజెక్టు 23 గేట్లు ఓపెన్ చేసి నీటిని కిందికి వదులుతున్నారు. నారాయణపూర్ డ్యామ్ దగ్గర 491.38 మీటర్ల లెవెల్ ను మెయింటెన్ చేస్తూ 25 గేట్లను ఓపెన్ చేసి 1.15 లక్షల క్యూసెక్కులు జూరాల డ్యామ్ కు వదులుతున్నారు. జూరాల వద్ద 317.300 మీటర్ల లెవెల్ ను మెయింటెన్ చేస్తూ 23 గేట్లను ఓపెన్ చేసి శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు 1.14 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండగా, 1,22,316 క్యూసెక్కులు వదులుతున్నారు.
565 అడుగులకు సాగర్ నీటిమట్టం..
హాలియా: నాగార్జునసాగర్ నీటిమట్టం శనివారం సాయంత్రం 6 గంటలకు 565 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం జలాశయం కుడి, ఎడమ విద్యుత్ ఉత్పాదన కేంద్రాల ద్వారా 67,800 క్యూసెక్కుల నీరు సాగర్ కు వచ్చి చేరుతోంది. నాగార్జునసాగర్ గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు(312.040 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 565 అడుగుల(239. 3427 టీఎంసీలు)కు చేరింది. హైదరాబాద్ జంట నగరాల తాగు నీటి అవసరాలకు ఏఎమ్మార్పీకి 1,800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
నాలుగు క్రస్ట్ గేట్లలో లీకేజీలు..
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నాలుగు క్రస్ట్ గేట్ల నుంచి నీళ్లు లీకవుతున్నాయి. ప్రాజెక్టుకు మొత్తం 26 క్రస్ట్ గేట్లు ఉండగా, వాటిలో 8,23,24,25వ నంబర్ క్రస్ట్ గేట్ల నుంచి లీకేజీ అవుతోంది. నాలుగు గేట్లకు రబ్బర్ సీల్ వేసినప్పటికీ నీళ్లు కిందికి వెళ్తున్నాయి. ఇలా ప్రతి రోజూ 70 క్యూసెక్కుల నీరు లీకవుతున్నట్లు తెలుస్తోంది. ఈ గేట్లకు మే నెలలోనే అధికారులు రిపేర్లు చేశారు. అయినప్పటికీ నీరు లీకవుతుండడం పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం
చేస్తున్నారు.