240 కిలోల నిషేధిత పత్తి విత్తనాలు పట్టివేత

240 కిలోల నిషేధిత పత్తి విత్తనాలు పట్టివేత
  •     ఆటోలో తరలిస్తుండగా రంగారెడ్డి జిల్లా ఎల్వర్తిలో సీజ్
  •     పోలీసుల అదుపులో ముగ్గురు, పరారీలో ఇంకో ఇద్దరు

శంకర్ పల్లి, వెలుగు: నిషేధిత పత్తి విత్తనాలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రూ.6 లక్షల విలువ చేసే 240 కిలోల బీజీఐఐఐ/హెచ్​టీ విత్తనాలను ఆటోలో తీసుకువస్తుండగా రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మండలంలో పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని, ఇంకో ఇద్దరు పరారయ్యారని రాజేంద్రనగర్ ఎస్​వోటీ, శంకర్​పల్లి పోలీసులు తెలిపారు. 

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం వెలిమలకు చెందిన శివశంకర్​రావు, శంకర్​పల్లి మండలం ఎల్వర్తికి చెందిన శ్రీనివాస్​రెడ్డి, శంకర్​పల్లికి చెందిన ఉదయ్​కిరణ్, హరిబాబుకు కర్నూలుకు చెందిన విత్తనాల సప్లయర్​శ్రీనివాస్​రావుతో కొన్నాళ్లుగా వ్యాపార సంబంధం ఉంది. తన వద్ద ప్రభుత్వం నిషేధించిన పత్తి (బీజీ-ఐఐఐ/హెచ్​టీ) విత్తనాలను శ్రీనివాస్ రావు కిలోకు రూ.2,500 లెక్కన 240 కిలోలు వాళ్లకు అమ్మాడు.

 అనంతరం వాటిని ఆటోలో తీసుకుని వస్తుండగా పోలీసులు బుధవారం శంకర్​పల్లి మండలం ఎల్వర్తి వద్ద ఆపి తనిఖీ చేశారు. నిషేధిత పత్తి విత్తనాలు, మొబైల్ ఫోన్​, రూ.2,500 నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఆటో డ్రైవర్​ శివశంకర్​రావు, శ్రీనివాస్​రెడ్డి, ఉదయ్​కిరణ్​ని అదుపులోకి తీసుకోగా.. సప్లయర్​ శ్రీనివాస్​రావు, హరిబాబు పరారీలో ఉన్నారని,  కేసు నమోదు చేసి  ఎంక్వైరీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.