25 వారాల గర్భం అయినా అబార్షన్​కు ఓకే : ఢిల్లీ హైకోర్టు

25 వారాల గర్భం అయినా అబార్షన్​కు ఓకే : ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: అత్యాచారానికి గురైన ఓ మైనర్ ​గర్భాన్ని తొలగించేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. సాధారణంగా 24 వారాలలోపు గర్భాన్ని తొలగించేందుకు చట్టం అనుమతిస్తుంది. అయితే ఈ కేసులో బాధితురాలు 25వ వారంలోకి ప్రవేశించిన తర్వాత ప్రెగ్నెన్సీ టెర్మినేషన్​కు కోర్టు పర్మిషన్​ ఇచ్చింది. రేప్​ బాధితురాలిపై మాతృత్వ బాధ్యతలను రుద్దడం అంటే ఆమె హక్కులను, గౌరవంగా జీవించే హక్కును నిరాకరించడమేనని కోర్టు అభిప్రాయపడింది. తనపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి బిడ్డకు జన్మనిచ్చేలా బలవంతం చేస్తే బాధితురాలికి అంతకంటే నరకం మరొకటి ఉండదని, అది వారి మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆ విషాదం నాటి క్షణాలు ప్రతి రోజూ ఆమె ముందు కదలాడుతూ ఉంటాయని పేర్కొంది. 

బాధితురాలి తల్లి అంగీకారంతో..

14 ఏండ్ల బాలిక తల్లిదండ్రులు నిర్మాణ పనులు చేస్తూ జీవిస్తున్నారు. తల్లి పనికి వెళ్లిన సమయంలో బాలికపై ఆత్యాచారం జరిగింది. వారి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆమె గర్భం ధరించి 25 వారాలు దాటిపోయింది. గర్భం తొలగింపునకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బాధితురాలి తల్లి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ స్వర్ణకాంత శర్మ.. బాధితురాలి తల్లి అంగీకారంతో గర్భాన్ని తొలగించేందుకు ఓకే చెప్పారు. రేప్​ బాధితురాలు గర్భం ధరించి 24 వారాలు దాటితే వారి మెడికల్​ టెస్టులకు సంబంధించి పలు గైడ్​లైన్స్​ను జారీ చేశారు. 

యూరిన్​టెస్ట్ తప్పనిసరిగా చేయాలి..

అత్యాచార బాధితురాలి మెడికల్​ టెస్టుల ఉత్తర్వుల జారీ ప్రక్రియలో కీలక సమయం పోతోందని, ఇది ఒక్కోసారి చట్టం అనుమతించే 24 వారాలను దాటిపోతోందని కోర్టు గుర్తు చేసింది. ఇలాంటి పరిస్థితులు బాధితురాలి ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయని పేర్కొంది. రేప్​ బాధితురాలికి మెడికల్​ టెస్టుల సమయంలో తప్పనిసరిగా యూరిన్​ టెస్ట్​ చేయాలని, చాలా కేసుల్లో ఇది చేయడం లేదని పేర్కొంది. రేప్​ బాధితురాలు మేజర్​ అయితే గర్భం తొలగించేందుకు ఆమె సమ్మతిస్తే అదే రోజు, మైనర్ అయితే ఆమె లీగల్​ గార్డియన్​ సమ్మతితో మెడికల్​ బోర్డు ముందు హాజరుపరచాలని సూచించింది. టెస్టులు చేసిన తర్వాత అధికారులు నివేదికను కోర్టుకు అందిస్తే.. సంబంధిత కోర్టు ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రెగ్నెన్సీ టెర్మినేషన్​కు సంబంధించి త్వరితగతిన ఉత్తర్వులు జారీ చేయడానికి వీలు కలుగుతుందని పేర్కొంది. ఇలాంటి కేసుల్లో నిందితుడి డీఎన్ఏ గుర్తింపు కోసం పిండం కణజాలాన్ని భద్రపరచాలని,  బాధితురాలి గర్భం రద్దు చేయడానికి అవసరమైన అన్ని ఖర్చులను ప్రభుత్వమే భరించాలని కోర్టు సూచించింది.