బొట్టు బిళ్లలు, దీపం వత్తుల తయారీ మెషీన్ల పేరుతో 250 కోట్లు టోకరా

బొట్టు బిళ్లలు, దీపం వత్తుల తయారీ మెషీన్ల పేరుతో 250 కోట్లు టోకరా

హైదరాబాద్‌‌, వెలుగు : హైదరాబాద్​ సిటీలో మరో భారీ మోసం బయటపడింది. బొట్టు బిళ్లలు, దీపం వత్తుల తయారీ మెషీన్ల పేరుతో ఓ వ్యక్తి సుమారు రూ.250 కోట్ల వరకు మోసం చేశాడు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్​ పరిధిలోని ఏఎస్ రావునగర్ లో ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో సుమారు 1,500 మంది మోసపోయినట్లు తెలుస్తోంది. 
కమీషన్​ ఇస్తామంటూ.. ఏఎస్ రావునగర్ లో రమేశ్​ రావులపల్లి అనే వ్యక్తి.. ఆర్ఆర్ ఎంటర్ ప్రైజెస్ పేరుతో ఒక కంపెనీ ఏర్పాటు చేశాడు. 

బొట్టు బిళ్లలు, దీపం వత్తుల తయారీ మెషీన్లు విక్రయిస్తామని, వాటితో పాటు మెటీరియల్​ కూడా ఇస్తామని అవి తయారు చేసి మాకే ఇస్తే కమీషన్​కూడా ఇస్తామని చాలా మందికి మాయమాటలు చెప్పాడు. వత్తులకు రూ.300, బొట్టు బిళ్లలకు రూ.600 కమీషన్ ఇస్తామని నమ్మించాడు. రూ.2 లక్షల 20 వేలకు బొట్టు బిళ్లల మెషీన్​, రూ.లక్షా 20 వేలకు ఆటో మేటిక్, రూ.లక్షా 80 వేలకు ఫుల్ఆటోమెటిక్ మెషీన్ విక్రయించాడు. రమేశ్​ మాటలు నమ్మి మెషీన్లు కొనుగోలు చేశారు. ఇలా తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన సుమారు 1,500 మంది నుంచి రూ.200  కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు వసూలు చేశాడు. ఇంట్లో భర్తలకు తెలియకుండా వందల మంది మహిళలు లక్షల రూపాయలు వడ్డీలకు తీసుకువచ్చి, ఒక్కొక్కరు రెండు మెషీన్​లు కొని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు మోసపోయారు. 

డబ్బలు ఇవ్వకుండా పరార్

దీపం వత్తుల మెషీన్లతో దూది వత్తులు తయారు చేసి ఇచ్చిన ఏ ఒక్కరికి కూడా రమేశ్​ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. డబ్బులు అడిగితే ఇవాళ, రేపు ఇస్తానంటూ గత ఆరు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఒకసారి బాధితులందరూ రమేశ్ ను నిలదీయడంతో కొద్దిసేపు ఆగండని చెప్పి.. కంపెనీ వెనుక దారి నుంచి తప్పించుకుని పారిపోయాడని చెబుతున్నారు. 

పోలీసులను ఆశ్రయించిన బాధితులు 

ఎట్టకేలకు మోసపోయామని తెలుసుకున్న బాధితులు సోమవారం కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు.  ప్రకాశం జిల్లా గిద్దలూరు గ్రామం, వెంకటాపురం కాలనీకి చెందిన రమేశ్, అతని అన్న రామారావ్​, సుధాకర్​, అశ్రద్​లు తమను మోసం చేశారని, మేము డబ్బులు కట్టి తీసుకున్న మెషీన్​లు వెనక్కి తీసుకుని తిరిగి డబ్బులు ఇవ్వమని అడిగితే బూతులు తిడుతూ, పారిపోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు కంప్లైంట్​ చేసిన వారిలో చర్లపల్లి డివిజన్ కు చెందిన రామసీత, విశ్వజిత్, తిరుమల, సుజాత, గణేష్​, ప్రవీణ్​ కుమార్, రవి శంకర్​ ఉన్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్​ఐ ఉపేందర్​యాదవ్​ తెలిపారు.