- సిద్దిపేట జిల్లాలో 2,500 ఇండ్లు క్యాన్సల్
- వారి స్థానంలో కొత్త లబ్ధిదారుల ఎంపికకు అధికారుల కసరత్తు
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాలో వివిధ కారణాలతో సకాలంలో నిర్మాణాలు ప్రారంభించని ఇందిరమ్మ ఇండ్ల ను అధికారులు రద్దు చేసి వాటిని అర్హులైన వారికి మంజూరు చేయడానికి కసరత్తు ప్రారంభించారు. జిల్లాలో నిర్మాణాలు ప్రారంభించని 2,500 ఇండ్లను అధికారులు గుర్తించి ఇటీవలే రద్దు చేశారు. రద్దయిన ఇండ్లకు కొత్తగా అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు స్వీకరణను ప్రారంభించారు. జిల్లాలని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, జనగామ(చేర్యాల, కొమురవెల్లి,దుల్మిట్ట,మద్దూరు మండలాలు) నియోజకవర్గాలతోపాటు మానకొండూరు నియోజవర్గంలోని బెజ్జంకి మండలానికి మొత్తం 13,100 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా వీటిలో 10,600 ఇండ్ల నిర్మాణాలను లబ్దిదారులు ప్రారంభించగా ప్రస్తుతం అవి వివిధ దశల్లో ఉన్నాయి.
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు లభించిన వారిలో 2,500 మంది నిర్ణీత 45 రోజుల లోపు నిర్మాణాలు ప్రారంభించలేదు. దీంతో నిర్మాణాలు ప్రారంభించని 2,500 ఇండ్లను గుర్తించి వాటిని రద్దే చేయడమే కాకుండా రద్దయిన ఇండ్లను అర్హులైన ఇతరులకు కేటాయించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని మండలాల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నారు. హుస్నాబాద్ నియోజకరవ్గంలోని కోహెడ మండలానికి 506 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా 59 ఇండ్ల నిర్మాణం ప్రారంభం కాకపోవడంతో వాటిని రద్దు చేశారు.
మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలానికి 502 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా 115 మంది నిర్మాణాలు ప్రారంభించక పోవడంతో వాటిని రద్దు చేశారు. జిల్లాలోని ఇతర మండలాల్లో సైతం నిర్మాణాలు ప్రారంభం కాని ఇండ్లను గుర్తించి వాటిని అధికారులు రద్దు చేశారు. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లకు సంబందించి అధికారులు దాదాపు రెండు వందల కోట్ల కు పైగా నిధులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. నిర్మాణాలు ప్రారంభించక రద్దయిన ఇండ్లను అర్హులైన వారికి కేటాయించే అవకాశాలు వుండటంతో పలువురు పేదలు ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.
ఇరవై శాతానికి పైగా ఇండ్ల రద్దు
సిద్దిపేట జిల్లాకు మంజూరైన మొత్తం ఇండ్ల లో దాదాపు ఇరవై శాతం వరకు పనులు ప్రారంభించలేదు. రద్దయిన ఇండ్ల లబ్ధిదారులు మాత్రం పలు కారణాలతో తాము ఇండ్ల నిర్మాణానికి ముందుకు రాలేదని పేర్కొంటున్నారు. ముఖ్యంగా నిర్మాణ సామగ్రి ధరల తో పాటు భవన నిర్మాన కూలీలు పెరగడంతో బడ్జెట్ అంచనాలు పెరగడం వల్ల నిర్మాణాలు ప్రారంభించడానికి వెనుకంజ వేసామని వాపోతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆరు వందల గజాల స్థలంలో ఇంటి నిర్మాణానికి పది లక్షలకు పైగా ఖర్చవుతుండగా తాము అనుకున్నట్టుగా ఆర్థిక వెసులుబాటు లేక నిర్మాణాలను పలువురు ప్రారంభించక పోవడం గమనార్హం.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇతరత్రా బుణ సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎందుకనే ఉద్దేశంతో మరికొందరు నిర్మాణాలకు వెనుకంజ వేశారు. ఇదిలా వుంటే పనుల ప్రగతిని బట్టి బిల్లులు మంజూరు చేస్తుండటంతో కొందరు లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణాల్లో జాప్యం అవుతోంది.
ప్రతిపాదనలు స్వీకరిస్తున్న అధికారులు
రద్దయిన ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన పేదలకు కేటాయించాలని హౌసింగ్ అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. మార్చి నెలాఖరులోగా రద్దయిన ఇండ్లను పేదలకు అందివ్వాలనే ఉద్దేశంతో ఆయా మండలాల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నారు. అధికారుల ప్రయత్నాలతో పలువురు పేదలు ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే ఆయా మండలాల ఎంపీడీవోలు రద్దయిన ఇండ్ల సంఖ్య ను బట్టి ప్రాథమికంగా అర్హులను గుర్తించే పనిలో ఉన్నారు. వచ్చే కొద్ది రోజుల్లో మండలాల వారీగా వచ్చిన ప్రతిపాదనలను బట్టి రద్దయిన ఇండ్ల ను ఇతరులకు కేటాయించే అవకాశం వుంది.
రద్దయిన ఇండ్లకు ప్రతిపాదనలు స్వీకరిస్తున్నాం
రద్దయిన ఇందిరమ్మ ఇండ్ల కు కొత్తగా ఆయా మండలాల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నాం. జిల్లాలో దాదాపు 2,500 వరకు నిర్మాణాలు ప్రారంభించని ఇందిరమ్మ ఇండ్లు రద్దు అయ్యాయి. మండలాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు పరిశీలించి అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లను కొద్ది రోజుల్లో మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం.- పవన్ కుమార్, పీడీ హౌసింగ్
