అమెరికాలో ఒక్కరోజే 2.54 లక్షల కేసులు..1173 మంది మృతి

అమెరికాలో ఒక్కరోజే 2.54 లక్షల కేసులు..1173 మంది మృతి

బాల్టిమోర్​/న్యూఢిల్లీ: అమెరికాలో ఇప్పటికే 70 శాతం మంది పెద్దలకు కరోనా టీకాలు వేశారు. మొత్తంగా జనాభాలో సగం మందికి వ్యాక్సిన్​ అందింది. అయినా కూడా అక్కడ కరోనా కేసులు మళ్లీ పీక్​కు చేరుతున్నాయి. మరణాలు పెరుగుతున్నాయి. నిరుడు డిసెంబర్​, ఈ ఏడాది జనవరి నాటి పరిస్థితులు వస్తున్నాయి. జాన్స్‌‌ హాప్కిన్స్‌‌ యూనివర్సిటీ లెక్కల ప్రకారం.. శుక్రవారం ఒక్కరోజే అగ్రరాజ్యంలో 2,54,981 మంది మహమ్మారి బారిన పడగా, 1,173 మంది దానికి బలయ్యారు. ఒక్కరోజులోనే కేసులు  రెట్టింపయ్యాయి. అంతకు ముందు రోజు 1.30 లక్షల మందికి కరోనా సోకింది. ఫ్లోరిడా, నార్త్​కరోలినా, టెక్సస్​, అరిజోనా, పెన్సిల్వేనియా, ఇల్లినాయీ, మసాచుసెట్స్​, న్యూయార్క్​లలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3 కోట్ల 56 లక్షల 95 వేల 469కి పెరిగింది. మరణాలు 6,16,493కి పెరిగాయి. ఈ వారంలో 8,95,343 మందికి కరోనా సోకింది. రోజూ 1,27,906 మంది దాని బారిన పడ్డారు. ఇటు వారంలో 4,181 మంది చనిపోగా.. సగటు మరణాలు 597గా నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 8,21,060 మందికి వ్యాక్సిన్​ వేయగా..  వ్యాక్సిన్లు తీసుకున్న వారి సంఖ్య 16.59 కోట్లకు చేరింది.  

జనం నిర్లక్ష్యం.. డెల్టా వేరియంట్​

అమెరికాలో సగం మందికి వ్యాక్సిన్​ అందినా కరోనా కేసులు పెరగడానికి ప్రధాన కారణం జనం నిర్లక్ష్యం, డెల్టా వేరియంటేనని నిపుణులు చెప్తున్నారు. ఈ ఏడాది జనవరి రెండో వారంలో కరోనా కేసులు పీక్​ స్టేజ్​ను తాకాయి. జనవరి 9న అత్యధికంగా 3.04 లక్షల కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టాయి. లాక్​డౌన్​ను అమలు చేయడం, వ్యాక్సినేషన్​లో వేగాన్ని పెంచడం వంటి కారణాలతో మే నాటికి కేసులు భారీగా పడిపోయాయి. జూన్​, జులై రెండో వారం వరకు పరిస్థితి కంట్రోల్​లోకి వచ్చింది. అయితే, జులై చివరి నాటికి పరిస్థితి తారుమారైంది. డెల్టా వేరియంట్​ విజృంభించడం, వేగంగా వ్యాపించడంతో కేసులు పెరిగిపోయాయి. మధ్యలో కేసులు తగ్గిపోయాయని అమెరికా మాస్క్​ రూల్​ను కూడా ఎత్తేసింది. లాక్​డౌన్​ను తీసేసింది. దీంతో జనం విచ్చలవిడిగా తిరిగేశారు. దాంతో పాటు చాలా మంది వ్యాక్సిన్లు వేసుకోబోమని మంకుపట్టు పట్టి కూర్చున్నారు. టీకాలపై చెడు ప్రచారాలూ చేశారు. దీంతో వ్యాక్సిన్​ అంటేనే చాలా మంది భయపడిపోయారు. చాలా చోట్ల ఆస్పత్రులన్నీ కరోనా పేషెంట్లతో నిండిపోతున్నాయని, బెడ్లు కూడా దొరికే పరిస్థితి లేదని అధికారులు చెప్తున్నారు. పిల్లలూ దాని బారిన ఎక్కువగా పడుతున్నారని హ్యూస్టన్​ హెల్త్​ డిపార్ట్​మెంట్​కు చెందిన డాక్టర్​ డేవిడ్​ ప్రెస్సీ చెప్పారు.

మన దేశంలో 38 వేల మందికి పాజిటివ్​

మన దేశంలో శుక్రవారం కొత్తగా 38,628 మందికి కరోనా సోకింది. మరో 617 మంది చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3 కోట్ల 18 లక్షల 95 వేల 385కి చేరింది. మరణాలు 4,27,371కి పెరిగాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే యాక్టివ్​ కేసులు 2,006 తగ్గాయి. యాక్టివ్​ కేసులు 4,12,153కి తగ్గాయి. రికవరీ రేటు పెరుగుతోంది. ఇప్పటిదాకా మహమ్మారి నుంచి 3 కోట్ల 10 లక్షల 55 వేల 861 మంది (97.37 శాతం) మంది కోలుకున్నారు. శుక్రవారం 17 లక్షల 50 వేల 81 టెస్టులు చేయగా.. పాజిటివిటీ రేటు 2.21 శాతంగా ఉంది. కాగా, మరణాల్లో 70 శాతం మందికి వేరే జబ్బులున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది.