దక్షిణ పెరూలోని మారుమూల ప్రాంతంలోని బంగారు గనిలో జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపు 27 మంది కార్మికులు మరణించారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన దక్షిణ అమెరికా దేశంలోనే ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న అత్యంత ఘోరమైన మైనింగ్ విషాదాలలో ఒకటి. అరేక్విపా ప్రాంతంలోని లా ఎస్పెరాంజా 1 గనిలోని సొరంగంలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ధృవీకరించింది. పేలుడు ధాటికి యానాక్విహువా పట్టణంలో ఉన్న గనిలోని చెక్క సపోర్టులకు మంటలు అంటుకున్నాయి. మంటలు చెలరేగిన సమయంలో గనిలో ఎంత మంది ఉన్నారనే దానిపై ఇప్పటివరకూ అధికారులు ఎలాంటి ప్రకటనా చేయలేదు. అంతే కాదు ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలతో బయటపడినట్లు ఇప్పటివరకు వెల్లడించలేదు.
గనిలో మంటలు అంటుకోవడంతో చాలా మంది మైనర్లు ఊపిరాడక, కాలిన గాయాలతో చనిపోయారని యానాక్విహువా మేయర్ తెలిపారు. లాటిన్ అమెరికాలో అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారు పెరూలో ఇటీవలి సంవత్సరాలలో జరిగిన ఘోరమైన మైనింగ్ ప్రమాదాలలో ఈ సంఘటన ఒకటి అని అధికారులు ప్రకటించారు. బాధితుల మృతదేహాలను బయటకు తీయడానికి రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయి.
మినేరా యాంక్విహువా ఈ చిన్న బంగారు గనిని నడుపుతున్నాడు. యాంక్విహువా ఒక చిన్న స్థాయి సంస్థ. కంపెనీ 23 ఏళ్లుగా పెరూలో గనులను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రమాదంపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. స్థానిక ప్రాసిక్యూటర్ గియోవన్నీ మాటోస్ మే 7న బంగారు గనిలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో 27 మంది మరణించారని స్థానిక టెలివిజన్‌తో చెప్పారు. ప్రపంచంలోనే అగ్రస్థానంలో బంగారం ఉత్పత్తి చేసే దేశం పెరూ.. అంతేకాదు ఇది రాగి ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉంది. పెరువియన్ ఆర్థిక వ్యవస్థలో మైనింగ్ ప్రధానంగా ఉంది. మైనింగ్, ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ సంఘటన 2000 నుంచి జరిగిన అత్యంత ఘోరమైన మైనింగ్ ప్రమాదం. గత సంవత్సరం, మైనింగ్ సంబంధిత సంఘటనలలో 39 మంది చనిపోయారు.
