281 మంది ఎంపీల ప్రమాణం

281 మంది ఎంపీల ప్రమాణం

న్యూఢిల్లీ: లోక్ సభలో మిగతా 281 మంది ఎంపీలు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో కాంగ్రెస్  అగ్రనేత రాహుల్  గాంధీ, మజ్లిస్  చీఫ్​ అసదుద్దీన్  ఒవైసీ, సమాజ్ వాదీ పార్టీ చీఫ్​ అఖిలేష్​  యాదవ్, డీఎంకే కనిమొళి, ఎన్సీపీ (శరద్  పవార్) సుప్రియా సూలే, పంజాబ్  మాజీ సీఎం, కాంగ్రెస్  ఎంపీ చరణ్ జిత్  సింగ్  చన్నీ, బీజేపీ ఎంపీలు అపరాజితా సారంగి, సంబిత్ పాత్ర, ఓం బిర్లా, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తదితరులు ఉన్నారు. 

18వ లోక్ సభ సమావేశాల్లో ప్రొటెం స్పీకర్  భర్తృహరి మహతాబ్  ఆ ఎంపీలతో ప్రమాణం చేయించారు. కాగా.. అంతకుముందు 262 మంది ఎంపీలు సోమవారమే ప్రమాణం చేశారు. వారిలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రితో పాటు మిగతా కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ఎంపీలు ఉన్నారు.

బీజేపీ ఎంపీ హిందూ రాష్ట్ర నినాదం..

బరైలీ నుంచి ఎంపీగా ఎన్నికైన బీజేపీ నేత ఛత్రపాల్  సింగ్   గాంగ్వార్  ప్రమాణం చేసిన తర్వాత ‘హిందూ రాష్ట్ర’ అని నినాదం చేశారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. ఆయన నినాదాలపై ప్రతిపక్ష నేతలు అభ్యంతరం తెలిపారు. ఆయన అలా ఎలా నినాదాలు చేస్తారని కొల్లం ఎంపీ ఎన్ కే ప్రేమచంద్రన్  ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని మిగతా నేతలు అన్నారు. అయితే, ఛత్రపాల్  వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని ప్రొటెం స్పీకర్  హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.

త‌‌‌‌‌‌‌‌మిళనాడు ఎంపీ తెలుగులో ప్రమాణం

తమిళనాడులోని కృష్ణగిరి లోక్‌‌‌‌‌‌‌‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కాంగ్రెస్  ఎంపీ కె.గోపీనాథ్  తెలుగులో ప్రమాణం చేశారు. రాజ్యాంగ ప్రతిని 
ఓ చేత్తో పట్టుకుని తెలుగులో ప్రమాణం చేశారు.