నిజామాబాద్ లో 285 నామినేషన్లు.. రైతుల నిరసన

నిజామాబాద్ లో 285 నామినేషన్లు.. రైతుల నిరసన
  • ఒక్కో ఊరు నుంచి దాదాపుగా ఇద్దరు రైతుల నామినేషన్
  • ఉదయం నుంచే కలెక్టరేట్ వద్ద బారులు
  • నామినేషన్ వేసినవారు 224  మంది
  • రాజకీయ నేతలు ఆపినా తగ్గని రైతులు
  • పసుపు బోర్డుఏర్పాటు, మద్దతు ధర,బోనస్ కావాలంటూ ఆందోళన

నిజామాబాద్, వెలుగు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ నిజామాబాద్ రైతులు వినూత్న నిరసనకు దిగారు. పసుపు, ఎర్రజొన్న,చెరుకు పంటలకు మద్దతు ధర కల్పిం చాలని డిమాండ్ చేస్తూ వందలమంది రైతులు.. నిజామాబాద్ లోక్ సభ స్థా నానికి నామినేషన్లు వేశారు.

నిజామాబాద్ లో రికార్డు స్థా యిలో 285 నామినే-షన్లు దాఖలయ్యాయి. సోమవారం చివరి రోజుకావడంతో ఒక్కరోజే నూట ఎనభై మందికిపైగా నామినేషన్ వేశారు. అందులో రైతులే పెద్దసంఖ్యలో ఉన్నారు. ఒక్కో ఊరి నుంచి ఇద్దరు చొప్పున వెయ్యి మంది రైతులు నామినేషన్ వేయాలని ముందుగా అనుకున్నా.. రాజకీయనేతల ఒత్తిళ్ల కారణంగా కొందరు వెనక్కి తగ్గారు. మొత్తంగా 200 మందికిపైగా రైతులు నామినేషన్ వేశారు. ఈ సీట్లో అధికార టీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుంచి మధుయాష్కీ, బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ బరిలో ఉన్నారు.

వారం రోజులుగా నామినేషన్లు

రాత్రి 8 గంటల వరకు స్వీకరణ

ఇక్కడ 18వ తేదీ నుంచే రైతులు నామినేషన్లు వేయడం మొదలుపెట్టారు. సోమవారం చివరి రోజు కావడంతో ఉదయం ఏడింటి నుంచే నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద రైతులు క్యూ కట్టారు. నామినేషన్ పత్రాలు, అవసరమైన డాక్యుమెంట్లన్నీ పట్టుకుని వచ్చారు. ఈ సమాచారం అందుకున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎం.రామ్మోహన్ రావు భారీగా బందోబస్తు ఏర్పాటు చేయించారు . ఎక్కువ కౌంటర్లను ఏర్పాటు చేశారు. నామినేషన్ వేసేందుకు వచ్చినవారందరికీ టోకెన్లు ఇచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకే గడువు ముగిసినా.. అప్పటికే టోకెన్లు ఇచ్చినవారి నుంచి రాత్రి 8 గంటల వరకు నామినేషన్లను స్వీకరించారు.

రైతులు, వారివెంట మద్దతుదారులు, సంఘీభావంగా వచ్చిన వివిధపార్టీల నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో గుమిగూడటంతో.. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.ఆర్మూర్, బాల్కొండ, మెట్‍పల్లి , కోరుట్ల, డిచ్ పల్లి ,బోధన్, ఆర్మూర్ నియోజకవర్గాల నుంచి రైతులు స్వచ్చందంగా వచ్చి నామినేషన్లు వేశారు. రైతులు తీసుకున్న నిర్ణయంతో అధికార పార్టీ ఆందోళన చెందుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె , సిట్టింగ్  ఎంపీ కవిత టీఆర్ఎస్​ తరఫున ఇక్కడ నామినేషన్​ దాఖలు చేశారు. వివిధ పార్టీల అభ్యర్థులు, రైతులు కలిపి 224 మంది.. 285 నామినేషన్లు దాఖలుచేశారు.

మద్దతు ధర.. బోనస్ డిమాండ్

నిజామాబాద్‌‌ జిల్లాలో పసుపు, ఎర్రజొన్న సాగుచేసే రైతులు ఎక్కువగా ఉన్నారు. ముఖ్యం గా ఈ లోక్​సభ సెగ్మెంట్​ పరిధిలో పసుపు రైతులు ఎక్కువ. తమపంటలకు గిట్టు బాటు ధర రావడం లేదంటూ రైతులుకొంతకాలంగా పోరాటాలు చేస్తున్నారు. నిజామాబాద్ లో ప్రత్యేకంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్నహామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సరైన స్పందన లేకపోవటంతో.. ఇప్పుడు కొత్త తరహా ఆందోళనకు దిగారు. జాతీయ స్థాయిలో తమ సమస్యను ఫోకస్​ చేసేందుకు.. లోక్​సభ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేయాలని నిర్ణయించుకున్నారు. ప్రతి గ్రామంనుంచి కనీసం ఇద్దరి చొప్పున పోటీ చేయాలని తీర్మానించుకున్నారు.