ఓయూలో 2వ తెలుగు లిటరరీ కాంగ్రెస్ ప్రారంభం

ఓయూలో 2వ తెలుగు లిటరరీ కాంగ్రెస్  ప్రారంభం
  •      జోష్​ నింపిన భాషాసాంస్కృతిక కార్యక్రమాలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ, తెలుగు శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఆర్ట్స్ కాలేజీ వేదికగా రెండు రోజుల 2వ తెలుగు  లిటరరీ కాంగ్రెస్​ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఓయూ వీసీ ప్రొఫెసర్ మొలుగారం కుమార్ మాట్లాడుతూ.. తెలుగు కేవలం సంభాషణ భాష మాత్రమే కాదు.. అది ఒక సంస్కృతి, జీవన శైలి అని అన్నారు. టెక్నాలజీని వినియోగించి తెలుగు భాష అభివృద్ధికి కృషి చేయవచ్చని తెలిపారు. 

నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, స్పీచ్-టు-టెక్స్ట్ వంటి ఏఐ ప్రక్రియల్లో తెలుగు భాషకు విస్తృత స్కోప్ ఉందన్నారు. కాంగ్రెస్ డైరెక్టర్, కాలేజీ ప్రిన్సిపాల్ చింతకింది కాశీం మాట్లాడుతూ.. సైన్స్ కాంగ్రెస్, హిస్టరీ కాంగ్రెస్ జరిగినట్లే తెలుగు లిటరరీ కాంగ్రెస్ కూడా జరపాలనే ఉద్దేశంతో ఈ మహాసభను ప్రారంభించామని చెప్పారు. 

ప్రైమరీ స్కూల్ టీచర్ల నుంచి యూనివర్సిటీ ప్రొఫెసర్ల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన కవి, రచయిత ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సాహిత్యం లేకపోతే మనిషి మానవీయ గుణాల నుంచి దూరమవుతాడని అన్నారు. చరిత్ర, సామాజిక శాస్త్రాలు స్థల కాలాలను రికార్డు చేస్తాయి కానీ, అస్తిత్వం, సంస్కృతి, భావోద్వేగాలను ప్రోత్సహించేది సాహిత్యమే అని వివరించారు. 

కార్యక్రమంలో  తెలుగు వర్శిటీ వీసీ ప్రొఫెసర్ వెల్దండ నిత్యానంద రావు,  టీయూ ఆర్ట్స్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ లావణ్య, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ చైర్మన్ కల్వల విశ్వేశ్వర రెడ్డి, తెలుగు సంపద సలహాదారు  డాక్టర్ రేమిళ్ల మూర్తి , ఓయూ తెలుగు శాఖ అధ్యక్షుడు, తెలుగు లిటరరీ కాంగ్రెస్ కన్వీనర్ ప్రొఫెసర్ సాగి కమలాకర శర్మ,  అధ్యాపకులు డాక్టర్ ఎస్ రఘు, డాక్టర్ చంద్రయ్య పాల్గొన్నారు.  

సాయంత్రం  ‘కవిత జిందగీ -కవితా దునియా’ కు ముఖ్య అథిగా భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్​ ఏనుగు నరసింహా రెడ్డి హాజరుకాగా.. సినీ రచయిత కాసర్ల శ్యామ్ విద్యార్థులను ఉత్తేజ పరిచారు. యువకవులు  కవిత్వం వినిపించగా..  ఒగ్గు కథ, కోలాటం, చిందు గానం, మొదలైన కళారూపాలతో ఉర్రూతలూగించారు. ఉదయం నుంచి రాత్రి 9 వరకు భాషా, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆర్ట్స్ కాలేజీ నిండిపోయింది.