రాష్ట్ర ఓటర్లు 3 కోట్లపైనే..

రాష్ట్ర ఓటర్లు  3 కోట్లపైనే..

అసెంబ్లీ ఎన్నికలకు వేగంగా ప్రిపేర్ అవుతున్నం

    ఇప్పటికే 10.5 లక్షల డూప్లికేట్ ఓట్లు తొలగించినం 
    ఈసారి కొత్త ఈవీఎంలతోనే ఎన్నికలు
    డబ్బుల పంపిణీపై నేరుగా ఈసీ పర్యవేక్షణ  
    ‘వెలుగు’తో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3 కోట్లు దాటింది. ప్రస్తుతం ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం కొనసాగుతోంది. ఫైనల్ పబ్లికేషన్ నాటికి రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3.05 కోట్లకు చేరే చాన్స్ ఉందని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) వికాస్ రాజ్ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఇటీవలే రాష్ట్రంలో పర్యటించి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సన్నద్ధతపై సీఈవో వికాస్ రాజ్ బుధవారం ‘వెలుగు’తో మాట్లాడారు. ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో డూప్లికేట్ ఓటర్ల తొలగింపును పకడ్బందీగా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి బూత్ లెవెల్ ఆఫీసర్ (బీఎల్ వో) తమ పోలింగ్ స్టేషన్ పరిధిలో డూప్లికేట్ ఓటరు ఎవరూ లేరని, డెత్ ఓటర్లను కూడా తొలగించామని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

దీంతో పూర్తిస్థాయిలో డబుల్ ఓట్లకు చెక్ పడుతుందన్నారు. సిమిలర్ ఫోటో ఎంట్రీలు, డెమోగ్రఫిక్ సాప్ట్​వేర్​తో కొన్ని డూప్లికేట్​ ఓటర్లను తొలగించామని తెలిపారు. ‘‘ఇప్పటిదాకా 10.5 లక్షల డూప్లికేట్ ఓట్లు తీసేశాం. అర్హులైన, నిజమైన వారి పేర్లే లిస్టులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఓటర్ల ఫైనల్ లిస్ట్ సెప్టెంబర్ చివరలో వస్తుంది. ఈ ఏడాది జనవరి 5 నాటికి రాష్ట్రంలో 2.99 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య 3 కోట్లు దాటింది” అని సీఈవో వివరించారు.   

 ఈ సారి కొత్త ఈవీఎంలు  

రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే ఏడాది జనవరి15 వరకు గడువు ఉందని.. అప్పటిలోపు ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ఎప్పట్లాగే ఆరు నెలల ముందే ఎలక్షన్ ప్రాసెస్ మొదలుపెట్టామన్నారు. 
‘‘ఈసీ బృందం సూచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నాం. ఆఫీసర్లకు ట్రైనింగ్ పూర్తి చేస్తున్నాం. ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు కొత్త ఈవీఎంలను వాడుతున్నాం. 73,210 ఈవీఎంలకు ఫస్ట్ లెవెల్ చెకింగ్ పూర్తవుతున్నది.  ఇందులో 54,310 కంట్రోల్ యూనిట్లు, 53,255 వీవీప్యాట్‌‌లు ఉన్నాయి” అని వికాస్ రాజ్  వెల్లడించారు.

క్యాష్​ ఫ్లోపై ఈసీ పర్యవేక్షణ  

ఎన్నికల్లో డబ్బుల పంపిణీ, ట్రాన్సాక్షన్లపై ఈ సారి నేరుగా ఈసీ మానిటర్​ చేస్తుందని సీఈవో తెలిపారు. ‘‘జీఎస్టీ, ఎస్ఎల్బీసీతో సహా అన్ని రకాల ఏజెన్సీలతో ఈసీ బృందం మీటింగ్ పెట్టింది. వారి సూచనలతో రెగ్యులర్​గా రివ్యూలు చేస్తూ ఎన్నికల సమయంలో డబ్బుల పంపిణీకి అడ్డుకట్ట వేస్తాం. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారనేది ముందుగానే గుర్తించి, ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి నుంచే అన్ని శాఖలతో కోఆర్డినేషన్ చేసుకుంటున్నాం” అని ఆయన వివరించారు.