రెస్పాన్సిబుల్ టెక్నాలజీకి కేరాఫ్ హైదరాబాద్ : డిప్యూటీ సీఎం భట్టి

రెస్పాన్సిబుల్ టెక్నాలజీకి కేరాఫ్ హైదరాబాద్ : డిప్యూటీ సీఎం భట్టి
  •     ఏఐ ప్రమాణాలకు దిక్సూచిగా తెలంగాణ: డిప్యూటీ సీఎం భట్టి
  •     మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ‘గ్రీన్ గ్రోత్ ఎకానమిక్ సమిట్‌‌ ది హైదరాబాద్ కలెక్టివ్’ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: ఏఐ రంగంలో ప్రపంచానికి దిక్సూచిగా తెలంగాణ నిలబడిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కృత్రిమ మేధస్సు రంగంలో ప్రపంచ దేశాలకు తెలంగాణ సరికొత్త దిశానిర్దేశం చేస్తోందనీ చెప్పారు. కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక ప్రయోజనాలను జోడించి ‘ఏఐ ప్రమాణాలకు దిక్సూచి’గా తెలంగాణ నిలుస్తోందని భట్టి ప్రకటించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని హెచ్ఐసీసీ వేదికగా జరిగిన ‘గ్రీన్ గ్రోత్ ఎకానమిక్ సమిట్ ది హైదరాబాద్ కలెక్టివ్’ కార్యక్రమాన్ని, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. ‘ది మెరీడియన్ కలెక్టివ్’ సంస్థ ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు ఈ సమిట్ జరగనుంది. ఈ సమిట్‌‌‌‌‌‌‌‌లో భట్టి మాట్లాడుతూ.. ఏఐ అంటే కేవలం క్లౌడ్ కంప్యూటింగ్, సర్వర్లు మాత్రమే కాదని, దీని వెనుక విద్యుత్, నీరు, భూమి, మానవ వనరుల భాగస్వామ్యం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందనీ తెలిపారు. 

‘‘మేము ఏఐ వద్దు అనడం లేదు, కానీ ఆ ఏఐ ఎలా ఉండాలో ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తున్నాము’’ అని ఆయన స్పష్టం చేశారు. ప్రకృతి వనరులను, ముఖ్యంగా నీరు, విద్యుత్తును హరిస్తూ ఏఐని నిర్మించడం కాకుండా, పునరుత్పా దక ఇంధనం, బాధ్యతాయుతమైన వనరుల నిర్వహణతో తెలంగాణ ఏఐకి కేరాఫ్ అడ్రస్‌‌‌‌‌‌‌‌గా మారుతోందని పేర్కొన్నారు. ‘‘కేవలం భూమి, నీరు, విద్యుత్ ఇచ్చి చేతులు దులుపుకునే పద్ధతి కాకుండా.. పరిశ్రమలు స్థానిక నైపుణ్యాలను పెంపొందించేలా మేం చర్యలు తీసుకుంటున్నాం. స్వచ్ఛమైన ఇంధనాన్ని వాడాలి. రీసైకిల్ చేసిన నీటిని మాత్రమే వినియోగించాలి. ఇది కేవలం ఇంజనీరింగ్ మెరుగుదల కాదు ఇది మన విలువలకు నిదర్శనం’’ అని భట్టి ఆయన పేర్కొన్నారు.

రైతులకు, సామాన్యులకు భరోసా

వ్యవసాయానికి, సామాన్యులకు దక్కాల్సిన నీటితో సాంకేతికత ఎప్పుడూ పోటీ పడకూడదని భట్టి విక్రమార్క అన్నారు. నీటి వినియోగంలో అత్యంత బాధ్యతాయుతమైన విధానాలను అనుసరిస్తున్న ఏఐ వ్యవస్థలకే తెలంగాణ ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఏఐ సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలని, భాషా అడ్డంకులను తొలగించి, గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన ప్రకటించారు.

తెలంగాణ డేటా సెంటర్లకు  రోల్ మోడల్: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ డేటా సెంటర్ల కేంద్రం మాత్రమే కాదు, ఆ డేటా సెంటర్లు ఎలా నిర్మించాలో ప్రపంచానికి నేర్పే ‘రోల్ మోడల్’ అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పరిశ్రమలకు స్వాగతం పలుకుతూనే, ప్రజల పక్షపాతిగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, భవిష్యత్తులో ప్రపంచ ఏఐ ప్రమాణాలను హైదరాబాద్ నిర్ణయించే స్థాయికి తీసుకువెళ్తాయన్నారు. పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న అద్భుతమైన వాతావరణం, పారదర్శకమైన పాలన విధానాలు పెట్టుబడిదారులకు గొప్ప భరోసానిస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో ఏఐ మేధస్సుతో పాటు, హ్యూమనిస్టిక్ విజ్డమ్ కూడా కలిగిన సంస్థలే ప్రపంచాన్ని ఏలుతాయన్నారు.