క్యూబా దౌత్యవేత్తతో ఎంపీ వంశీకృష్ణ భేటీ...భారత్– క్యూబా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ

క్యూబా దౌత్యవేత్తతో ఎంపీ వంశీకృష్ణ భేటీ...భారత్– క్యూబా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలోని క్యూబా రాయబార కార్యాలయ దౌత్యవేత్త జువాన్ కార్లోస్ మార్సాన్ అగ్విలెరాతో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ భేటీ అయ్యారు. మంగళవారం ఢిల్లీ లోని ఎంపీ నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామితో చిత్రంతో కూడిన పుస్తకాన్ని అగ్విలేరాకు అందజేశారు. సుమారు అరగంట పాటు సాగిన ఈ సమావేశంలో క్యూబాలో ప్రస్తుత పరిస్థితులు, భారత్–క్యూబా ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు చర్చించారు. రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత విస్తరించడం, దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహబంధాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. 

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, మాజీ క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో మధ్య ఉన్న చారిత్రాత్మక స్నేహాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ స్నేహమే భారత్–క్యూబా సంబంధాలకు బలమైన పునాది వేసిందన్నారు. అలాగే తన తాత, దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత కాకా వెంకటస్వామి, ఇందిరా గాంధీకి సన్నిహిత సహచరుడిగా ఆ కాలంలో భారత్–క్యూబా సంబంధాల అభివృద్ధిని ప్రత్యక్షంగా చూసారని వంశీకృష్ణ గుర్తు చేశారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇరు దేశాల మధ్య సహకారం, ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం తనపై ఉందన్నారు.