ప్లాస్టిక్ బొమ్మల ఫ్యాక్టరీలో సిలిండర్ పేలుడు: ముగ్గురు మృతి

ప్లాస్టిక్ బొమ్మల ఫ్యాక్టరీలో సిలిండర్ పేలుడు: ముగ్గురు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో బొమ్మల ఫ్యాక్టరీలో సిలిండర్ పేలి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో పది మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. అలీగఢ్‌లోని ఖతికన్ ఏరియాలో ప్లాస్టిక్ బొమ్మల తయారీ ఫ్యాక్టరీ ఉంది. దానిలో మంగళవారం కార్మికులు బొమ్మల తయారీలో ఉండగా ఉన్నట్టుండి సిలిండర్ పేలింది. ఆ పేలుడు ధాటికి సీలింగ్ కూలి అక్కడున్న వర్కర్స్‌పై పడింది. ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు జరగడంతో అక్కడికి దగ్గరలో ఉన్న వాళ్లు పరిగెత్తుకుంటూ స్పాట్‌కి వచ్చారు. పోలీసులు, ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు ఫోన్ చేసి ప్రమాదం గురించి చెప్పారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది, లోకల్ వాలంటీర్స్ అంతా కలిసి సహాయ చర్యలు చేపట్టారు. కూలిన సీలింగ్ కింద చిక్కుకున్న వాళ్లను రక్షించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మరణించగా.. పది మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు వల్ల గాయపడిన వారిని జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ, మల్ఖాన్ సింగ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. పేలుడు జరిగిన సమయంలో కార్మికులు బొమ్మలు తయారు చేస్తున్నారని, ఘటన జరగడానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని అలీగఢ్ ఎస్పీ అభిషేక్ కుమార్ చెప్పారు. పేలుడు వల్ల ఫ్యాక్టరీతో పాటు చుట్టుపక్కల నాలుగైదు ఇళ్లు డ్యామేజ్ అయ్యాయని చెప్పారు.